సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఈరోజు వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై మోదీ సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే ఇరుపార్టీల పని అని ఆరోపించారు. కుటుంబ శ్రేయస్సు కోసమే కేసీఆర్ పరితపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతి మయమేనని దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన మాపై నిందలు వేస్తారా?. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని యువతపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తెలంగాణ మా కుటుంబం.. రాష్ట్ర ప్రజలు మా కుటంబ సభ్యులు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న కుటుంబ పార్టీ మాది. కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి బెదిరిస్తే మేం భయపడం. తెలంగాణకు వచ్చి ఉత్త చేతులతో పోవడం మోదీకి అలవాటే అంటూ సెటైరికల్ పంచ్ విసిరారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల ఖాళీల గురించి మాట్లాడిన ప్రధాని, దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీల ఖాళీల భర్తీ కోసం మా ప్రభుత్వ రూపొందించిన చట్టాన్ని, గవర్నర్ తమిళసై తొక్కిపెట్టిన విషయంలో ప్రధానమంత్రి స్పందించి ఉంటే బాగుండేదని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్ కొత్త నాటకాలు మొదలెట్టారు: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment