సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోకున్నా, చాలా చోట్ల మాత్రం తన ఉనికిని చాటుకుంది. పూర్తి ఆధిక్యంతో మూడు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్న బీజేపీ.. కార్పొరేషన్లలో తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వెనక్కి తోసి 65 డివిజన్లను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ కార్పొరేషన్‌లో అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎంలను దీటుగా ఎదుర్కొని 60 స్థానాలకు గానూ ఒంటరిగానే 28 స్థానాలు గెలుచుకొని తన ప్రభావాన్ని నిలుపుకుంది.
నిజామాబాద్‌లో సత్తా..
బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ల పరిధిలోని మున్సిపాలిటీల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ తన సత్తా చాటుకుంది. ఇక్కడ 60 డివిజన్లకు గానూ బీజేపీ ఒంటరిగానే 28 స్థానాలు గెలిచింది. టీఆర్‌ఎస్‌కు 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్‌లు ఒక స్థానంలో గెలిచారు. ఇక్కడ హంగ్ రావడంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్‌లు కీలకం కానున్నారు.
ఇదే పార్లమెంట్ పరిధిలోనే ఉన్న ఆర్మూర్, బోధన్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్లలో చెప్పుకోదగ్గ స్థానాలే సాధించింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ పరిధిలో 6 మున్సిపాలిటీల పరిధిలో బీజేపీ కేవలం 16 వార్డులను గెలుచుకుంది. జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో బీజేపీ ఖాతా తెరవలేదు. అధికంగా హుజురాబాద్ పరిధిలో 5 స్థానాలు, సిరిసిల్లలో 3 స్థానాలు గెలుచుకుంది.
ఆదిలాబాద్, భైంసాలలో ఇలా..
బీజేపీ ఎంపీ బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉండగా ఇక్కడ 22 స్థానాలు గెలిచింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 స్థానాలకు గానూ 11 బీజేపీ గెలువగా, భైంసాలో ఎంఐఎంకి గట్టిపోటీ ఇచి్చంది. ఇక్కడ 26 స్థానాలకు గానూ ఎంఐఎంతో పోటీపడి 9 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఎంఐఎం 15 స్థానాలు గెలువగా, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. టీఆర్‌ఎస్ ఇక్కడ ఖాతా తెరవలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో బీజేపీ ఖాతా తెరవలేదు.
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్‌గల్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీలను పూర్తి మెజార్టీతో గెలుచుకుంది. మక్తల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మక్తల్‌లో టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్స్‌అఫీíÙయో సభ్యులుగా ఉన్నారు. వారు ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ ఖా తాలోకే వెళ్లనుంది. మిగతా మున్సిపాలిటీల పరిధిలో ఒక్క గద్వాల పరిధిలోనే రెండంకెల మార్కు స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ 37 స్థానాలకు గానూ 10 స్థానాలు గెలుచుకుంది.
టీఆర్‌ఎస్ అడ్డదారిలో గెలిచింది: లక్ష్మణ్
‘అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు చేసింది. ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. అడ్డదారిలో, అక్రమంగా టీఆర్‌ఎస్ గెలిచింది. బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీచేసి గెలిచింది. ఈ ఎన్నికలు బీజేపీ విస్తరణకు ఉపయోగపడ్డాయి. టీఆర్‌ఎస్‌కు ఉన్న ధన, ఇసుక, మద్యం, కాంట్రాక్టు మాఫియాతో పాటు.. అధికార పారీ్టకి వత్తాసు పలికిన పోలీసులతో పోటీ పడ్డాం.
మంత్రి కేటీఆర్ తన పనితీరుకు ఈ ఫలితాలు పరీక్ష అని అన్నారు. ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే బీజేపీ 4, స్వతంత్రులు 10 చోట్ల గెలిచారు. సొంత ఇలాకాలోనే ఆయన నైతికంగా ఓడిపోయారు. రాష్ట్రంలో క్రమంగా టీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గుతుంటే, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్, కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ మా సత్తా చాటుతాం.’
Comments
Please login to add a commentAdd a comment