
న్యూఢిల్లీ: 1977లో ఎమర్జెన్సీ తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదుర్కొన్న పరిస్థితినే ఈసారి మోదీ ఎదుర్కోబోతున్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబిస్తున్నారు. 1947లో దేశవిభజన అనంతరం యూపీలోని అలీగఢ్, రాజస్తాన్‌లోని కోటా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ మాతృసంస్థ జన్‌సంఘ్ గట్టిపునాది ఏర్పరచుకుంది. 1980లో ఈ సంస్థ బీజేపీగా రూపాంతరం చెందింది. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా విస్తరించినప్పటికీ మరో పదేళ్లవరకూ యూపీలో పట్టుసాధించలేకపోయింది. మాజీ ప్రధాని, జాట్ కులస్తుడైన చరణ్ సింగ్‌కు యూపీలోని రైతు వర్గాలు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతో బీజేపీ ఎదగలేకపోయింది. ఆర్యసమాజ్‌కు చరణ్‌సింగ్ మద్దతు, ములాయం, చరణ్‌సింగ్ కొడుకు అజిత్‌ల మధ్య వర్గపోరుతో బీజేపీ యూపీలో విస్తరించింది.
ఏకమైన విపక్షాలు
ఈ నేపథ్యంలో 2019లో బీజేపీని ఎదుర్కోవాలంటే ఒక్కటవ్వాలని నిర్ణయించిన విపక్షాలు చురుగ్గా పావులు కదిపాయి. కైరానాలో ఆర్‌ఎల్డీ తరఫున పోటీచేసిన తబస్సుమ్ హసన్‌కు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు ప్రకటించాయి. జాట్, మైనారిటీ ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో తబస్సుమ్ 44 వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. 1977లో ఇందిరాగాంధీ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితినే మోదీ ఎదుర్కొంటున్నారని తాజా ఎన్నికల ఫలితాలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇందిరను గద్దె దించాయనీ, ప్రస్తుతం దేశంలో ఆదే తరహాలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో రైతుల సమస్యలతో పాటు చెరుకు పంటకు ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన బాకీలు లక్ష్యంగా ప్రచారంచేశామని ఆర్‌ఎల్డీ నేత దూబే తెలిపారు.