
మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి
అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు చేస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం పార్లమెంటులో చర్చకు రానున్న నేపథ్యంలో ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా సంకల్ప మానవహారం’ చేపట్టనున్నట్లు తెలిపారు.
హోదా కోసం పోరాడుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాలు, నిరుద్యోగులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా అంశాన్ని నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చిన బీజేపీ, టీడీపీలు ఈ రోజు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా టీడీపీ చేసిన తప్పిదాలను ఇతరులపై నెట్టేందుకు కుటిలయత్నం చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఉదయానికే మాట మార్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఉగాది శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు అనంత వెంకటరామిరెడ్డి విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment