బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదన్నారు. ఢిల్లీలో కె.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ..రాఫెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లారని విమర్శించారు. దేశ రక్షణ విషయాలలో రాజకీయాలు తగవన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైన కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, నాలుగున్నర ఏళ్లలో అవినీతి మచ్చపడకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తుందని చెప్పారు. అధికారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ తప్పును ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదులకు మధ్య పొరుగా ప్రజలు భావించి ప్రజలంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచారని అన్నారు. కేసీఆర్ కుటుంబపాలన, అవినీతిని ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, జనవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణాలో పర్యటిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులందరినీ నేరుగా వెళ్లి కలుస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment