
దక్షిణాదిలో ఇంకో దఫా పాగా వేసేందుకు తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీ వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందుకోసం బహుముఖ వ్యూహాలు రచిస్తోంది. గెలుపు గుర్రాలకు సీట్లు ఇస్తూ.. హిందుత్వ అజెండాను అమలు చేస్తూ.. కులసమీకరణలకూ ప్రాధాన్యం తగ్గకుండా చూస్తోంది.
గత ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 72 నియోజకవర్గాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలని కేంద్రానికి సిఫారసు చేయడంతో ఆ వర్గం ఓట్లు దూరమవుతాయన్న ఆందోళన బీజేపీలో కనిపించడం లేదు.
తొలి జాబితాలోని నియోజకవర్గాల్లో లింగాయతులు, వీరశైవుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నవి చాలా ఉన్నప్పటికీ ఆయా వర్గాల వారికి మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. లింగాయత వర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాం కాబట్టి ఆ వర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేస్తోంది.
ఫిరాయింపుదార్లకూ టికెట్లు!
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంతో కచ్చితంగా గెలవగలరు అనుకునే నేతలకే టికెట్లు కేటాయిస్తోంది. ఇందుకోసం అవతలి పార్టీల నేతలను తమవైపు తిప్పేసుకునేందుకూ వెనుకాడటం లేదు. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి పలువురు నేతలను తమవైపు తిప్పుకున్న కాషాయ దళం తన తొలి జాబితాలో పదిమంది ఫిరాయింపు నేతలకు టికెట్లు కేటాయించడం గమనార్హం.
కలబుర్గి జిల్లా అఫ్జల్‌పురా సీటును రెండు వారాల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన మాలికయ్య గుత్తేదారుకు ఇవ్వడంపై స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేసినా పార్టీ నాయకత్వం ఖాతరు చేయలేదు. 2013 ఎన్నికల్లో బీజేపీ నుంచి వైదొలిగి సొంత పార్టీలు పెట్టుకుని పోటీచేసిన యడ్యూరప్ప(కర్ణాటక జనతా పక్ష–కేజేపీ), బి.శ్రీరాములు(బీఎస్‌ఆర్ కాంగ్రెస్) తర్వాత తమ పార్టీలను మాతృ సంస్థలో విలీనం చేశారు.
ఫలితంగా వీరి అనుచరులకూ ఈసారి బీజేపీ తన తొలిజాబితాలో స్థానం కల్పించింది. బెళగావి జిల్లా కుదాచీ స్థానం నుంచి పి.రాజీవ్, ఇదే జిల్లాలోని బైలహొంగళ నియోజకవర్గం నుంచి విశ్వనాథప్ప పాటి ల్‌కు సీట్లు దక్కాయి. వీరు గత ఎన్నికల్లో యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీల తరఫున బరిలోకి దిగారు.
‘హిందుత్వ’ఆయుధం..
హిందుత్వను ఆయుధంగా బీజేపీ ఎప్పటిలానే వాడుకుంటోంది. తామే నిజమైన హిందువులనేలా వ్యవహరిస్తోంది. నెల క్రితం సిద్ధరామయ్య చేపల కూర తిని దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల మంజునాథ స్వామిని సందర్శించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జావరి కోడి మాంసం తిని కొప్పళ జిల్లా కనకగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారని యడ్యూరప్ప ట్వీటర్లో విమర్శించారు. రాహుల్‌ను ‘ఎలక్షన్ హిందూ’గా ఆయన అభివర్ణించారు.
‘కాంగ్రెస్ పదేపదే ఎందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది? అందరినీ సమంగా చూస్తే అది సామ్యవాదం. మీది మజావాదం?’ అంటూ బీఎత్తిపొడిచారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచా రం నాటి నుంచి హిందూ గుడులు–గోపురాలు దర్శించడం రాహుల్‌కు అలవాటుగా మారిన నేపథ్యంలో ఆయన నిజమైన హిందువు కాదని చెప్పడానికి ‘ఎన్నికల హిందువు’గా బీజేపీ చూపిస్తోంది.
రంగంలోకి ఆరెస్సెస్..
మరోవైపు కాషాయ కుటుంబ పెద్ద ఆరెస్సెస్ కూడా బీజేపీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తోంది. మొదటిసారి ఎన్నికల కేంద్రాల(బూత్‌లు) వారీగా తమను అభిమానించే ఓటర్లను రప్పించి కమలానికి ఓట్లేసేలా చేసే బాధ్యతను ఆరెస్సెస్ తన భుజాలపై వేసుకుంది. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేక సర్కారుగా ‘సంఘ్’పరివార్ సంస్థలు చూడటమే దీనికి కారణం.
‘వాస్తవానికి చాలా మంది కర్ణాటక కాంగ్రెస్ నేతలకు మేం వ్యతిరేకం కాదు. వారంతా మంచి హిందువులే. ఆరెస్సెస్‌ను వారు దూషించరు. వ్యక్తిగతంగా మాకు వారిపై కోపం లేదు. కానీ, సిద్ధరామయ్య భిన్నమైన నేత. ఆయన కమ్యూనిస్టులా వ్యవహరిస్తారు. సంఘ్‌పై ఆయన విధానాలతో ఆగ్రహంగా ఉన్నాం. ఆయనను సైద్ధాంతికంగా, వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాం. అందుకే, కర్ణాటకలో యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీకి సాయపడాలని ఆరెస్సెస్ నిర్ణయించింది’ అని సంఘ్ నేత ఒకరు వెల్లడించారు.
కుల సమీకరణలపైనా దృష్టి
బలమైన లింగాయత్ నేత యడ్యూరప్ప ఉండగా మితిమీరిన కుల సమీకరణలకు పోకుండా అన్ని సామాజికవర్గాల ఓట్లు సాధించి తప్పకుండా అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్నికల ఎత్తుగడలు రూపొందించింది. పూర్తి కాలం పదవిలో కొనసాగడం వల్ల కన్నడ ప్రజల్లో పాలకపక్షంపై వ్యతిరేకత ఉందనీ, దీన్ని ఉపయోగించుకుంటే విజయం తథ్యమని భావిస్తోంది.
సిద్ధరామయ్య మాదిరిగానే కురబ(బీసీ) వర్గానికి చెందిన కేఎస్ ఈశ్వరప్ప శాసనమండలిలో ప్రతిపక్ష(బీజేపీ) నేత. భవిష్యత్తులో ఈశ్వరప్ప సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశమున్న కారణంగా ఆయనను శివమొగ్గ జిల్లాలో పోటీకి దింపుతోంది. దళితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మొగ్గుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఎస్సీలు 18 శాతం ఉండగా, ఎస్టీలు 7 శాతమని అంచనా. ఈ రెండు వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎస్టీ వర్గానికి(వాల్మీకి బోయ) చెందిన బళ్లారి ఎంపీ బి.శ్రీరాములును ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ ప్రకటనతో 25 శాతం ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో అనేక మందిని తమ వైపు తిప్పుకోవచ్చని యడ్యూరప్ప భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment