సాక్షి, బెంగళూరు/పావగడ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధిస్తే ప్రధాని అయ్యేందుకు సిద్ధమని ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన మనసులో మాటను బయటపెట్టారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అవుతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్ సాధించే ఫలితాలపై అది ఆధారపడి ఉంటుంది.. ఒకవేళ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిస్తే ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పారు.
తొమ్మిది నెలల వ్యవధిలో దేశ ప్రధాని కావాలన్న ఆకాంక్షను రెండోసారి రాహుల్ వెలిబుచ్చారు. గత సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనలో భాగంగా బెర్కెలీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉండేందుకు తాను సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.
2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి రావడం ఖాయమని.. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత బీజేపీకి మరోసారి అధికారం దక్కనివ్వదని రాహుల్ చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని కాలేరని పూర్తి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు. ‘బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కన్నడనాట కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను బీజేపీ ప్రోత్సహిస్తోంది. జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి 8 సీట్లు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనం. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భూస్థాపితం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశాం. యూపీలో వచ్చే ఏడాది బీజేపీ 10 స్థానాలకే పరిమితమవుతుంది’ అని చెప్పారు. ఓటమి భయంతోనే ప్రధాని మోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: రాహుల్
పావగడ పట్టణ సమీపంలో బాలాజీ మిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లా డుతూ.. ‘మోసం చేయకూడదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అన్న బసవణ్ణ సిద్ధాంతాలను ఐదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటించిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, ఎంపీ చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
రాహుల్‌ను ముంగేరీలాల్‌తో పోల్చిన ప్రధాన్
రాహుల్‌ను ఒకప్పటి దూరదర్శన్ సీరియల్‌లోని ప్రధాన పాత్రధారి ముంగేరీలాల్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోల్చారు. ‘పగటి కలలు కనకుండా ముంగేరీలాల్‌ను ఎవరైనా ఆపగలరా’ అంటూ పరోక్షంగా విమర్శించారు. ‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్‌లోని ఈ పాత్ర రోజువారీ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు పగటికలలు కంటూ ఆనందించేవాడు. రాహుల్ పెద్ద పెద్ద కలలు కంటున్నారని, మొదట కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment