సాక్షి, బళ్లారి: రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సిద్ధపడిన కాంగ్రెస్ పార్టీ అందుకు ఇప్పటికే సాకులు వెతకడం ప్రారంభించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ సమాజాన్ని విడదీసి కుల విషాన్ని వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను కన్నడ ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించి గుణపాఠం చెప్పడం తథ్యమని పేర్కొన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు లేని మంత్రి ఒక్కరూ లేరని విమర్శించారు.
ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం అధికంగా ఉన్న విజయపుర జిల్లాలోని సారవద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న అంచనాలు, సర్వేలను కొట్టిపారేశారు. లింగాయత్‌లకు చేరువ కావడానికి తన ప్రసంగంలో పలుమార్లు వారి ఆరాధ్య దైవం, సంఘ సంస్కర్త బసవేశ్వరుడి పేరును ప్రస్తావించారు.
కొడుకు వల్ల కాలేదు.. అందుకే తల్లితో ప్రచారం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నడిపించడంలో అధ్యక్షుడు రాహుల్ సమర్థతపై సొంత పార్టీలోనే అనుమానాలున్నాయని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కాంగ్రెస్ నాయకుడి ఇంటర్వ్యూ చూశాను. కొడుకు(రాహుల్) వల్ల కర్ణాటకలో తాము గెలవలేమని వారు భావిస్తున్నారు.
ఆ పార్టీ అభ్యర్థులు కనీసం డిపాజిట్ కాపాడుకోవడానికైనా తల్లి(సోనియా)తో ప్రచారం చేయిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో అవినీతి మరకలు లేని ఒక్క మంత్రి పేరైనా చెప్పాలని సీఎం సిద్దరామయ్యకు సవాలు విసిరారు.
బసవేశ్వరుడి గడ్డపై అలా జరగదు..
విభజించు, పాలించు విధానమే కాంగ్రెస్ అభిమతమని, సోదరుల్లా ఉన్న ప్రజల మధ్య కొట్లాట పెట్టడమే ఆ పార్టీ లక్ష్యమని మోదీ మండిపడ్డారు. బసవేశ్వరుడు పుట్టిన ఈ గడ్డపై అలా జరగకుండా ప్రజలు అడ్డుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరితో కలసి సాగాలని బసవేశ్వరుడు బోధించారు.
కానీ కాంగ్రెస్ కులాలు, మతాల ప్రాతిపదికన చీలికలు తెస్తోంది. అదే వాళ్ల గేమ్ ప్లాన్. అయితే బసవేశ్వరుడు పుట్టిన ఈ నేల కులం పేరిట చీలిపోదని కాంగ్రెస్ నాయకులకు తెలియడం లేదు. కాంగ్రెస్‌ను గద్దె దించి కుల విషం వ్యాపించకుండా ప్రజలు అడ్డుకుంటారు’ అని లింగాయత్‌లకు మైనారిటీ కల్పిస్తూ తెచ్చిన ప్రతిపాదనను పరోక్షంగా తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment