కోర్టు తాత్కాలిక ఉత్తర్వుల అనంతరం విక్టరీ చిహ్నం చూపుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి తేజస్వీ సూర్య
సాక్షి, బెంగళూరు: తన మీద మీడియా ఎలాంటి కథనాలు, ప్రచారాలు చేయకుండా ఉండటానికి దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి తేజస్వి సూర్య, న్యాయస్థానం నుంచి తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు ఉత్తర్వుతో 49 ఆంగ్ల, కన్నడ చానెళ్లు, పత్రికలు, సామాజిక మాధ్యమాలు గూగుల్, ఫేస్‌బుక్‌లో తేజస్వికి వ్యతిరేకంగా ఎటువంటి వార్తలు, కథనాల ప్రచురణకు అవకాశం లేదు. మరుసటి వాదనల కోసం కేసును మే 27కు వాయిదా వేసింది కోర్టు. ఈ నిర్ణయంతో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు తేజస్వీకు ఊరట లభించినట్టైంది.
తేజస్వి సూర్య స్వతహాగా న్యాయవాది. ఆయనలో ఎవరికీ తెలియని చీకటి కోణం ఉందంటూ మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక మహిళ ట్విటర్‌లో చేసిన పోస్ట్‌తో దుమారం రేగింది. దీన్ని పలు మీడియా సంస్థలు హైలైట్ కూడా చేశాయి. దీన్ని సవాల్ చేస్తూ తేజస్వి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. తేజస్వీని మరో ఎంజే అక్బర్‌గా పోలుస్తూ విమర్శలకు దిగారు. కర్ణాటక కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తేజస్వి ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్‌తో దర్యాప్తు చేపట్టాలని పట్టుపట్టారు. తేజస్వి నామినేషన్ వేసిన తర్వాత ఇలాంటి వివాదం రేగడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంలో తేజస్వికి వ్యతిరేకంగా పరువునష్టం కలిగించే ప్రచారాలు చేయవద్దంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టు న్యాయాధిపతి దినేష్ హెగ్డే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment