సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సమాచారం చోరీకి గురైందా లేదా అనేది చెప్పాల్సిన ప్రభుత్వం.. తమపై ఎదురుదాడి చేయడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ బాలశౌరితో కలిసి లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా అదే రీతిలో మాట్లాడటం శోచనీయమన్నారు. పదేళ్లు హైద్రాబాద్ రాజధానిగా ఉండే హక్కు ఉందని చెప్పే స్పీకర్..అక్కడ ఫిర్యాదు ఇస్తే తప్పేంటో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చి ..ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతారా అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తులతో లాలూచిపడి అసత్యాలు మాట్లాడటం సరైన పద్ధతేనా అని జే సత్యన్నారాయణ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయన తక్షణమే స్పందించాలని, యూఐడీఏఐలో ఆయన ఉన్నారో లేదో చెప్పాలన్నారు. ఆయన ద్వారానే ఆధార్ సమాచారం అంతా బయటకు వచ్చిందని చెప్పారు. వ్యక్తులకు సంస్థలకు డేటా ఉంటుందని.. దీంతో తమకు పనిలేదని, అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమాచారంతో కూడిన డేటాను తీసుకోవడం వల్లనే సమస్య వచ్చిందని తెలిపారు.
విజయనగరం జిల్లాలో ఐప్యాడ్‌లో ఆధార్ కార్డులు, ఓటర్ల లిస్ట్ సమాచారం ఉందంటే అది పబ్లిక్ డాక్యుమెంట్ అని బుకాయించారన్నారు. తాము డీజీపీకి, ఎన్నికల కమీషనర్‌కు ఆ ట్యాబ్‌లను అందజేసి విచారించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తాము చెప్పినట్టే ఇప్పుడు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇంత పారదర్శకంగా అక్రమాలపై పోలీసులు, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తే తమపై ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రిడ్స్‌తో సంబంధం లేదని చెబుతున్న ప్రభుత్వం నిన్నగాక మొన్న పుట్టిన సంస్థకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి భూములు ఎందుకు కేటాయింపులు చేసిందని నిలదీశారు. వ్యక్తిగత సమాచారాన్ని ఏ హక్కు ఉందని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని నిలదీశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగిస్తుందంటూ ఎదురుదాడి చేస్తున్నారని, అసలు ఆ అధికారం తమకెలా ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సర్వేల పేరుతో సమాచారం సేకరించి, ఫిర్యాదు చేస్తే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతోందని మండిపడ్డారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర పరువును బజారు కీడ్చారని, స్పీకర్ సైతం ఆ పదవి గౌరవాన్ని మంటగలిపే విధంగా మాట్లాడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు. అనుకూల ఛానల్స్‌లో డప్పు కొట్టించుకున్నా ప్రయోజనం లేదన్నారు. సర్వేల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని తాము ఆరు నెలలుగా చెబుతూనే ఉన్నామని బొత్స తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఇకకైనా నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.
తప్పు మీరు చేసి..మాపై ఎదురుదాడేంటి?
Published Wed, Mar 6 2019 4:32 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment