కాకినాడ: ‘న్యాయవ్యవస్థపై విశ్వాసంలేదు...చట్టాలపై గౌరవంలేదు.. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం లేదు..ఇలాంటి సర్కార్‌పై పోరాడి ప్రజలకు అండగా నిలబడాలి’ అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షునిగా కంపర రమేష్ ప్రమాణస్వీకారోత్సవం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్‌హాలు గ్రౌండ్స్‌లో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా బొత్స మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుతీరును నిరసిస్తూ శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడేందుకు తమ పార్టీ అసెంబ్లీకి వెళ్ళరాదని నిర్ణయించిందన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమిని రానున్న ఎన్నికల్లో గెలుపుగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచి పార్టీ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలన్నారు. మరో ముఖ్య అతిథి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి విధానాలతో ప్రజలు విసిగి పోయారన్నారు. తప్పులను ప్రశ్నిస్తే పోలీసు వ్యవస్థతో దాడులకు దిగుతున్నారని విమర్శించారు.
ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. గడచిన మూడున్నరేళ్ళలో ఇంటిపన్నులు, విద్యుత్‌చార్జీలు విపరీతంగా పెరిగాయని, ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చి, వార్డుకో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 200లకు పైగా రహస్య జీవోలను తెచ్చిన చరిత్ర టీడీపీ సర్కార్‌దేనన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలిచి పోరాడాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ గోరంత అభివృద్ధిని కొండంత చేసి చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్ళదీస్తున్న టీడీపీ సర్కార్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
మాజీ మంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతూ జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరరత్న పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయన్నారు. కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలు చేస్తోన్న చంద్రబాబు అసమర్థ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌వల్ల మాత్రమే సాధ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ టీడీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతీ కార్యకర్త సంసిద్ధులు కావాలన్నారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగితే పార్టీకి ఎదురులేదన్నారు. జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతి సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ జగన్ నాయకత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ కనిపిస్తోందన్నారు.
నగరంలో భారీ ర్యాలీ
వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షునిగా కంపర రమేష్‌తో సీనియర్ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రమాణస్వీకారం చేయించారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేయించారు. అంతకు ముందు రమేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, సన్నిహితులతో కోకిలా సెంటర్ నుంచి భానుగుడి, మెయిన్‌రోడ్డు, మసీదు సెంటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డు నుంచి వెంకటేశ్వరఫంక్షన్‌హాలు వరకు ర్యాలీ చేశారు. ప్రమాణస్వీకారం చేసిన రమేష్‌ను పలువురు అభిమానులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, సంగిశెట్టి అశోక్, కో ఆర్డినేటర్లు గిరజాల బాబు, పితాని బాలకృష్ణ, పిఠాపురం ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి, జిల్లాపార్టీ సంయుక్త కార్యదర్శి మత్సా గంగాధర్, మాజీ కార్పొరేటర్లు దండు మహాంతి లక్ష్మణరావు, బసవా చంద్రమౌళి, ర్యాలి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment