సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన యత్నిస్తున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 9,696 ఎంపీటీసీ స్థానాలకు 50,063 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వీటిలో వైఎస్సార్‌సీపీ 23 వేలు, టీడీపీ 18వేలు, జనసేన 2వేలు, బీజేపీ 1800 నామినేషన్లు దాఖలు చేశాయని చెప్పారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే ఇన్ని వేల మంది ఎలా నామినేషన్‌లు వేశారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎక్కడైనా పర్యటించవచ్చని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో సున్నితమైన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి పర్యటించాలని సూచించారు. బొండా ఉమా 15 కార్లలో గూండాల మాదిరిగా వెళ్లారని.. అలా వెళితే ప్రజలు అడ్డగించరా అని మంత్రి ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సినిమాలు అలవాటని, అందుకనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిందని ప్రజలకు తప్పుడు సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని మంత్రి కొనియాడారు. మార్పు తెచ్చేందుకే ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంపిణీ జరగకూడదని చట్టం తెచ్చామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment