ఉత్తరప్రదేశ్‌లో ‘ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారులందరూ చేతులు కలిపి మహాగఠ్ బంధన్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. మాయావతి ప్రచారంపై ఎన్నికల సంఘం విధించిన నిషేధానికి ఇదే ‘తగిన స్పందన’ అవుతుంది’ అంటూ మాయావతి పార్టీలో ‘రైజింగ్ స్టార్’ ఆకాష్ ఆనంద్ ఇటీవల ఆగ్రా ఎన్నికల ప్రచారసభలో తొలి ప్రసంగం చేశారు. ఆయన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతికి స్యయానా మేనల్లుడు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు. కొన్నేళ్ల క్రితం తన రాజకీయ వారసుడని చెప్పకుండానే ఆనంద్‌కుమార్‌ను మాయావతి బీఎస్పీ ఉపాధ్యక్షునిగా నియమించారు. తర్వాత ఆయన సామర్ధ్యంపై అనుమానాలతో పాటు నియామకంపై విమర్శలు రావడంతో తమ్ముడిని కొద్ది రోజులకే పదవి నుంచి తొలగించారు.
తర్వాత అక్క చాటున ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆనంద్ ఇల్లు, సంస్థలపై ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించింది. బీఎస్పీలో ఆయన పాత్ర లేకుండా పోయింది. కొన్నేళ్లకు హఠాత్తుగా ఆయన కొడుకు ఆకాష్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిని చేసే పనికి మాయావతి శ్రీకారం చుట్టారు. మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన నేపథ్యంలో.. దీనిని తన మేనల్లుడి రాజకీయ రంగ ప్రవేశానికి చక్కగా వాడుకున్నారు. ఆమె స్థానంలో ఆకాష్ ఎన్నికల ప్రచారాన్ని ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి కొనసాగించారు.
బ్రిటిష్ వర్సిటీలో చదువు..
బ్రిటన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆకాష్ వయసు 24 ఏళ్లు. సరైన సమయంలోనే ఆకాష్‌ను రాజకీయాల్లోకి తెచ్చిన మేనత్త.. తన రాజకీయ వారసునిగా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై ఊహాగానాలను మీడియాకే వదిలేశారు. ఆగ్రా ఎన్నికల సభలో వేదికపై ఒకవైపు అఖిలేశ్ కూర్చోగా, మధ్యలో ఆకాష్, రెండో చివర బీఎస్పీ సీనియర్ బ్రాహ్మణ నేత సతీష్‌చంద్ర మిశ్రా కూర్చున్నారు. మేనత్త మాయావతి మాదిరిగానే ఆకాష్ కూడా రాసుకొచ్చిన ప్రసంగాన్ని చదివారు. ఆగ్రాలో మాయావతి కులస్తులైన జాటవులు (చర్మకారులు) పెద్దసంఖ్యలో ఉన్నారు. ఐదేళ్ల క్రితం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికయ్యాక మాయావతి ఓ ఆశ్చర్యకర విషయం ప్రకటించారు. తన రాజకీయ వారసుడు తన వర్గమైన జాటవుల నుంచే వస్తాడనీ, అయితే తన కుటుంబం నుంచి కాదని మాయావతి చెప్పారు. కొన్నాళ్లకు తమ్ముడు ఆనంద్‌కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ప్రకటించా రు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయరని, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే దృష్టి పెడతారని తెలిపారు. ఇది నచ్చని సీనియర్ నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, నసీముద్దీన్ సిద్దిఖీ బీఎస్పీ నుంచి వైదొలిగారు. తర్వాత పదవికి తగిన అర్హతలు లేని ఆనంద్ నెమ్మదిగా పార్టీ వ్యవహారాల నుంచి తప్పుకున్నారు.
ఆజాద్‌కు పోటీగా..?
పశ్చిమ యూపీలో జాటవులను ఆకట్టుకుంటున్న దళిత నేత భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ దూకుడుకు పగ్గాలు వేయడానికి మయావతి ఆకాష్‌ను రంగంలోకి దింపారు. ఎస్పీతో సీట్ల పంపిణీ చర్చల్లో తొలిసారి ఆకాష్ చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల ఈసీ నిషేధం నేపథ్యం లో మాయావతి తన మేనల్లుడిని ఆర్భాటం లేకుం డా రాజకీయ రంగ ప్రవేశం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment