సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం చర్యలు చేపడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పరాయి రాష్ట్రంలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని, కలసి జీవించాలని, జాగ్రత్తలతో ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు సూచించారన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావిస్తే చంద్రబాబు దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. కరోనా పరీక్షల కిట్ల కంపెనీలో తాను డైరెక్టర్‌గా ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించారు. ‘నేను డైరెక్టర్‌గా ఉన్నట్లు నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తా. లేదంటే కన్నా రాజీనామా చేస్తారా?’ అని సవాల్ విసిరారు.
ప్రముఖులంతా అదే చెప్పారు..
► కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదు. ఈ యుధ్దంలో నూరు శాతం విజయం సాధించడం అసంభవం. కేసులు సున్నాకు వచ్చేవరకు వ్యవస్ధను పునఃప్రారంభించకుంటే ఇబ్బందులు తప్పవని ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తదితరులు చెప్పారని బుగ్గన గుర్తు చేశారు.
► కరోనాతో సహజీవనం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థే చెబుతోంది. మాస్కులు మన జీవితంలో భాగం కాబోతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
లోకేశ్ నాయుడూ.. లెక్కలు తెలుసుకో
నారా లోకేశ్ నాయుడు ఉదయం ఒకటి సాయంత్రం మరో ట్వీట్‌తో పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోలేకపోతోందని టీడీపీలోనే ఒకరు విమర్శలు చేస్తుంటే లోకేశ్ నాయడు మాత్రం అదనంగా రూ.30 వేల కోట్లు ఆదాయం వచ్చిందని, మార్చి నెలాఖరులో పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించారంటూ అవాస్తవాలు చెబుతున్నారని బుగ్గన పేర్కొన్నారు.
► 2018–19 ఆర్ధిక ఏడాదిలో రూ.1,64,841 కోట్ల ఆదాయం వస్తే 2019–20లో రూ.1,70,000 కోట్ల ఆదాయం వచ్చిందని బుగ్గన వివరించారు. అంటే అదనంగా దాదాపు రూ.ఐదు వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
► మార్చి 30, 31 తేదీల్లో పిల్లల చదువులు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పెన్షన్లు, డైట్ చార్జీలు, 104,108 వాహనాల కొనుగోళ్లకు రూ.6,411 కోట్లు ఇచ్చాం. ఇందులో గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, పిల్లల చదువులకు మిగిల్చిన బకాయిలు కూడా ఉన్నాయి.
► కరోనా నియంత్రణ చర్యలతోపాటు లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ఇప్పటివరకు రూ.8,757 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
► లోకేష్ నాయుడు తీరు చూస్తుంటే పిల్లల చదువులు, ఆరోగ్యశ్రీ, డైట్ చార్జీలు, సంక్షేమ పెన్షన్లకు నిధులు ఇవ్వొద్దని చెబుతున్నట్లుగా ఉంది. ఆయన ఇప్పుడైనా లెక్కలు చూసుకోవాలి.
దేశంలోనే అత్యధికంగా పరీక్షలు..
► ఆంధ్రప్రదేశ్‌లో 5.34 కోట్ల జనాభా ఉండగా 1,02,460 çకరోనా పరీక్షలు చేశాం. ప్రతి పది లక్షల మందికి సగటున 1,919 పరీక్షలు చేశాం. ఇది దేశంలోనే అత్యధికం.
► దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల శాతం 4.12 కాగా ఆంధ్రప్రదేశ్‌లో 1.5 శాతం మాత్రమే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ టెస్ట్‌లు చేసి పాజిటివ్ శాతాన్ని తక్కువగా చూపిస్తున్నారు.
► కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందుతున్నందున రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. 403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ అవుతున్నారంటే ట్రీట్‌మెంట్ బాగుండబట్టే కదా.
► చంద్రబాబు కనుక ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే కరోనాపై కత్తి యుద్ధం, అర్థరాత్రి ఒంటి గంట వరకు బాబు సమీక్ష, ఐరాసలో కరోనాపై బాబు ప్రజెంటేషన్, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులపై ఆగ్రహం, ఆఖరికి కరోనాను బాబు జయించారు లాంటి వార్తలను ప్రచారం చేసుకునేవారు.
Comments
Please login to add a commentAdd a comment