
సాక్షి, తాడేపల్లి: కరోనాపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబుకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలకడం బాధాకరమన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఎల్లో మీడియా వంత పాడుతుందని ధ్వజమెత్తారు. కరోనా టెస్ట్ కిట్లు కొనుగోలు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కన్నా ఆరోపణలు అర్థ రహితమన్నారు.
(కోవిడ్-19 ఎఫెక్ట్‌పై షాకింగ్ సర్వే)
కన్నా సమాధానం చెప్పాలి..
ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలను కేంద్రం, జాతీయ మీడియా ప్రశంసించాయని చెప్పారు. కిట్‌ను రాష్ట్రం రూ.730కి కొంటే.. కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందన్నారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా, టీడీపీ నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారని.. వారితో కలిసి కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
ఆత్మ పరిశీలన చేసుకోవాలి..
విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వాలంటీర్ల వ్యవస్థ తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోందని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment