బాబుకు బీజేపీ పెద్దల వార్నింగ్‌ | C Ramachandraiah Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుకు బీజేపీ పెద్దల వార్నింగ్‌

Published Mon, Jun 18 2018 1:07 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

C Ramachandraiah Slams Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, కడప : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పులిలా, ఢిల్లీలో పిల్లిలా తయారయ్యారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీకి చంద్రబాబు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి కేంద్రాన్ని నిలదీయకుండా నిద్రపోయారా అంటూ మండిపడ్డారు. నాలుగేళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న టీడీపీ, ఈరోజు డ్రామాలు చేస్తూ దొంగ దీక్షలకు సిద్ధమౌతోందని దుయ్యబట్టారు. ఇక్కడ ఏమో ఢిల్లీకి వెళ్తే ప్రకంపనలు వస్తాయని బాబు డప్పు కొట్టుకుంటున్నారని, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదని అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని రామచంద్రయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయామని విమర్శించారు. నీతి ఆయోగ్‌ సమావేశం వల్ల రాష్ట్రానికి ఒరిగిన లాభం ఏమీ లేదన్నారు. హోదా కోసం ఢిల్లీలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా మద్దతు అడిగారా అని ప్రశ్నించారు. హోదా గురించి దేశంలో ఎక్కడా ప్రస్తావించొద్దని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు హెచ్చరించారని, ఆ సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు.

చంద్రబాబు మంతనాల రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడని, ఇందుకోసం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ఢిల్లీలో బీజేపీతో మంతనాల కోసం పెట్టారని రామచంద్రయ్య ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఎన్నికల సర్వే మొత్తం బోగస్‌ అని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు సర్వే నిర్వహించిన వారితో మాట్లాడామని, వాళ్లు చెప్పింది ఒకటని... కానీ ఎల్లో మీడియా మరొకటి చూపించిందని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement