ఈ టపాసులు ఎలక్షన్‌ స్పెషల్‌ | Cabinet decision that state government should take up such projects in AP Reorganisation Act | Sakshi
Sakshi News home page

ఈ టపాసులు ఎలక్షన్‌ స్పెషల్‌

Published Wed, Nov 7 2018 3:47 AM | Last Updated on Wed, Nov 7 2018 8:02 AM

Cabinet decision that state government should take up such projects in AP Reorganisation Act - Sakshi

మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం మెట్రో రైలు, దుగరాజపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులను తామే సొంతంగా చేపడతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మూడు లేఖలు రాయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు తెలియజేశారు.

రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, తక్షణమే వాటన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ప్రధానికి మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తిత్లీ తుపాన్‌ విషయంలో కేంద్రం వైఖరిపై కేంద్ర హోంమంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి విభజన చట్టంలోని హామీలపై ఏనాడూ నోరుమెదపని టీడీపీ సర్కారు ఇపుడు ఎన్నికల ముంగిట ఏదో చేసేయబోతున్నట్లు హడావిడి చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఇదేదో కొత్త గిమ్మిక్కు మాదిరిగా ఉందని జనం చర్చించుకుంటున్నారు.

కడప ఉక్కు కర్మాగారం  
వైఎస్సార్‌ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించామన్నారు. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేశామన్నారు. నెల రోజుల్లో పునాదిరాయి వేయనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టరుగా గతంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించామన్నారు. ప్రైవేటు సంస్థలతో జాయింట్‌ వెంచర్‌గా ముందుకెళ్లాలని భావించామని చెప్పారు. ఈ కార్పొరేషన్‌కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లు కేటాయించామని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,000 కోట్లుగా అంచనా వేశామన్నారు.  
 
విశాఖ మెట్రో... 
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం విశాఖపట్నం మెట్రో ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని, సత్వరం ప్రాజెక్టును చేపట్టనున్నట్లు మంత్రి కాలువ తెలిపారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆర్‌ఎఫ్‌పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కాలువ తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో 42.55 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాజెక్టు తాజా అంచనా వ్యయాన్ని రూ.8,300 కోట్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు సివిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చు నిమిత్తం బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) లేదా ఏదైనా విదేశీ ఫండ్‌ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థల నుంచి భారతీయ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లకే రూ.4,200 కోట్లు మించకుండా రాష్ట్ర ప్రభుత్వ వన్‌టైమ్‌ సావరిన్‌ గ్యారంటీతో అప్పుగా తీసుకోవడానికి ఏఎంఆర్‌సీ అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌ నుంచి నిరంతరాయంగా సరఫరా చేస్తారన్నారు.  
 
దొనకొండలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌  
ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ నిర్మాణానికి 2,395.98 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దొనకొండ మండలం రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని ‘దొనకొండ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లా  ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పైబర్‌ నెట్‌కు రూ.3,283 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును 2019 జూన్‌ నాటికి పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ·బందరు పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసం రూ.200 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు.  
 
తాగునీటి సరఫరాకు రూ.22 వేల కోట్లు  
గ్రామీణ ప్రాంతాల్లో రూ.22,000 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. మొదటి విడతగా రూ.9,400 కోట్లతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సరఫరా పనులను చేపట్టేందుకు ఏపీడీడబ్ల్యూఎస్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అనుమతిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.   
 
అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌  
‘అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రస్టుకు వచ్చే నిధుల ద్వారా భవిష్యత్తులో అన్న క్యాంటీన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.  
 
కేబినెట్‌ మరికొన్ని నిర్ణయాలు  

- భాషా పండితులు/ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లను స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదం.  
250 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల మంజూరు ప్రతిపాదనకు  ఆమోదం.  
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొత్తగా మంజూరైన సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు సిబ్బంది మంజూరు.   

బీజేపీతో కలిపి ఉన్నప్పుడు గుర్తుకు రాలేదేం.. 
రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టం ప్రకారం దక్కాల్సి ఉంది. ఈ హక్కును ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడే మెడలు వంచి సాధించుకోవాల్సి ఉండగా, నాలుగున్నరేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం మౌనం వహించింది. బీజేపీతో కలిసి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్నంత కాలం చంద్రబాబు సర్కారుకు కడప ఉక్కు కర్మాగారం గుర్తుకు రాలేదు. ఎన్నికల ముంగిట శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ఎత్తులు వేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నుంచి విడిపోయిన తరువాత కడపలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేత ‘దీక్ష’లు చేయించి, ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నట్లుగా సీఎం చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారు. అంతకుముందు సీఎం రమేష్‌ ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో ఈ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తుందనడం ఎన్నికల స్టంటేనని పరిశీలకులు చెబుతున్నారు. ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.  
 
రామాయపట్నం పోర్టు వెనుక..  
విభజన చట్టం ప్రకారం నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు కావాల్సి ఉంది. నాలుగున్నరేళ్లపాటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజల చెవుల్లో పూలు పెడుతోంది. దుగరాజపట్నం పోర్టు కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఎన్ని పర్యాయాలు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ పోర్టును కాదని, రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సర్కారుకు నిజంగా శ్రద్ధ ఉంటే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఏనాడో పట్టాలెక్కేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంపై నాలుగున్నరేళ్లపాటు ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కడప ఉక్కు కోసం నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాటం
వైఎస్సార్‌ జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయా లని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాలుగున్నరేళ్లుగా పోరాడుతోంది. ప్రత్యేక హోదాతోపాటు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పట్టుపడుతూనే ఉంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లిన అన్ని సందర్భాల్లోనూ కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పార్లమెంట్‌లో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉక్కు పరిశ్రమ కావాలంటూ ప్రొద్దుటూరులో సభ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ సమావేశాల్లో, స్థానిక సంస్థల సమావేశాల్లో పరిశ్రమ కోసం తీర్మానాలు చేయించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన పోరాటానికి మద్దతివ్వని టీడీపీ ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరిట హడావుడి చేయాలని నిర్ణయించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement