
ఆదిలాబాద్: దళితులను విస్మరిస్తే ఊరుకునేది లేదని, దళితులను విస్మరించే ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని కేంద్ర సామాజిక, న్యాయసాధికారిత మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆదిలాబాద్‌లో ఆదివారం ధమ్మచక్ర పరివర్తన్ దివస్, భీం గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనార్టీల కోసం అంబేడ్కర్ రాజ్యాంగంలో అన్నిరకాల హక్కులను పొందుపర్చారని, వర్గ విభేదాలు లేకుండా సమన్యాయ హక్కులతో రాజ్యాంగం రూపొందించారని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా సమస్యలను రాజ్యసభలో పరిష్కరించేలా చూస్తామన్నారు. దేశంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలు అందించేలా రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ గీతాలతో కూడిన సీడీని ఆవిష్కరించారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, దళిత సంఘాల నాయకులు ప్రజ్ఞకుమార్, శైలేందర్, దీపక్‌కుమార్, రమాబాయి, తదితరులు పాల్గొన్నారు.