
సాక్షి, విజయవాడ : ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరమని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడుపడుతోందని కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తాము సందర్శించామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. పాతరేట్లకే ప్రాజెక్టు పనులు చేయించింది కేంద్రమంత్రి గడ్కరీయేనని వారు అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పోలవరం పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని వారు ఆదివారం విలేకరులతో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకుంది కాబట్టి సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా చెల్లించని బిల్లులు లేవని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని కన్నా తెలిపారు. నూటికి నూరుశాతం కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును కడుతున్నారని తెలిపారు. దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని నూరుశాతం కేంద్రమే భరిస్తోందని తెలిపారు. పోలవరం బాధ్యత తమది అని గడ్కరీ చెప్పారని అన్నారు. చంద్రబాబుకి నిజం చెప్పడం రాదని, తమకు అబద్ధం చెప్పడం రాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment