
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలకు బుద్ధిచెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆ విధంగా జరగనిపక్షంలో ప్రజాస్వామ్యమే ప్రమాదం లో పడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తూ, చిన్న విమర్శను కూడా సహించే పరిస్థితి లేదన్నారు. ఫిరాయింపులు, ప్రాంతీయతత్వంతో మైండ్‌గేమ్ ఆడుతూ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎదురైన ఓటమితో టీఆర్‌ఎస్ తీరు ‘కుడితిలో పడిన ఎలుక’ మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నా లోక్‌సభ ఎన్నికల్లో ఎదురీదుతుండటంతో కేసీఆర్ బేజారయ్యారని విమర్శించారు.
ఆదివారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో చాడ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికెందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న తన కుమార్తెను గెలిపించుకునే క్రమంలో మద్దతు కోసం మండవను కూడా ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలోనూ జోరుగా ప్రలోభా ల పర్వం నడిచిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ వైఖరితో తెలంగాణకు ఫిరాయింపుల రోగం పట్టుకుందని, దీనిని ప్రజలు తమ తీర్పు ద్వారా వదిలించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్, ఇతర పథకాలకు సంబంధించి రూ.16 వేల కోట్ల మేర బిల్లులు విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం దివాళా తీసిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఇప్పుడు 16 ఎంపీలను గెలిపిస్తే ఏదో చేస్తామని టీఆర్‌ఎస్ అగ్రనేతలంటున్నారని, గతంలోనే 15 ఎంపీల మద్దతున్నా విభజన హామీలను సాధించలేని దౌర్భాగ్యస్థితిలో ఆ పార్టీ ఎంపీలున్నారని విమర్శించారు.
ఇందూరులో రైతు ప్రతినిధికి మద్దతు...
నిజామాబాద్ నుంచి పెద్దసంఖ్యలో పోటీ చేస్తున్న ఎర్రజొన్న, పసుపురైతులు తమ ప్రతినిధిగా ఎవరినైనా ఒకరిని పెడితే మద్దతునిచ్చేందుకు సీపీఐ సిద్ధంగా ఉన్నట్టు చాడ ప్రకటించారు. ఈ రైతాంగం సాగిస్తున్న పోరాటం న్యాయమైనదన్నారు. మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునివ్వాలని పార్టీ నిర్ణయించిం దని చెప్పారు. కాంగ్రెస్‌ను తాము లౌకికపార్టీగా పరిగణిస్తుండగా, వాయనాడ్‌లో సీపీఐపైనే రాహుల్‌గాంధీ పోటీకి దిగడం విడ్డూరమన్నారు. ఈ నేపథ్యంలో మరి కొన్నిసీట్లలో మద్దతునివ్వాలని కాంగ్రెస్ అభ్యర్థులు కోరారని, అయితే ఇతర స్థానాల్లో ఎవరిని బలపరచాలనే విషయంపై జిల్లా శాఖలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.