
టవర్‌సర్కిల్ (కరీంనగర్) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గులాబీ జెండా ఓనర్లం తామేనని మంత్రి ఈటల రాజేందర్.., రాష్ట్రం పేరు తప్ప పాఠశాలలు ఏమీ మారలేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ పార్టీలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని బయటపెట్టాయన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోవిలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను హుందాగా స్వీకరించాల్సిందిపోయి, బెదరగొడతామనడం ప్రజల గొంతు నొక్కడమేనన్నారు.
యూరియా కొరత సీఎం నియోజకవర్గంలో కూడా ఉన్నదని, రైతులు చెప్పులను లైన్లలో పెట్టే దృశ్యాలు కన్పించడం దురదృష్టకరమన్నారు. యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్ బొమ్మ చెక్కడం, ఆయన రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని హితవుపలికారు. కాగా, తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు విమోచనం గురించి తెలియజేసేందుకే ఈనెల 11 నుంచి 17 వరకు వారోత్సవా లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment