సాక్షి, కరీంనగర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం వద్ద తన వాహనంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలకు చాడ వెంకట్ రెడ్డితోపాటు కమ్యూనిస్టులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా వెట్టిచాకిరి బానిసత్వం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభాకర్ రావు లాంటి వారు ఎందరో పోరాడి అసువులు బాశారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అలాంటి సమరయోధులను గుర్తుంచుకునేలా ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్రం కోసం పోరాడిన ప్రభాకర్ రావు లాంటివారు ఎన్‌కౌంటర్ అయిన హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టల్లో స్మృతి వనంతో పాటు కరీంనగర్‌లోని ప్రభాకర్ రావు విగ్రహం వద్ద పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఇలాంటి పరిస్థితుల్లో నాటి పోరాటయోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కమ్యూనిస్టులు పోరాడక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment