
సాక్షి, అమరావతి: దేశానికి రాబోయేది కొత్త ప్రధానేనని, మోదీ ఇకపై ప్రధానిగా ఉండబోరని ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. దేశ రాజకీయాల్లో మోదీ వల్ల హుందాతనం కొరవడిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో శుక్రవారం జరిగిన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మోదీ వ్యతిరేక గాలిని దేశ వ్యాప్తంగా ఉధృతం చేశామని, ఓటమి నైరాశ్యంతో మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని.. దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి టీడీపీ వల్లేనని చెప్పారు. 27 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మహిళలు పూర్తిగా టీడీపీ వైపే..
ఈనెల 23న జరిగే కౌంటింగ్‌లో తేడాలు వస్తే అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని బూత్‌లు లెక్కించాలన్నదే పార్టీ డిమాండ్ అని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాలవల్ల రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని, పథకాల వల్ల ఓటింగ్ పెరిగిన తొలి ఎన్నిక ఇదేనని తెలిపారు. 1983 తర్వాత ఇంత పెద్దఎత్తున పోలింగ్ శాతం పెరిగింది ఇప్పుడేనని, మహిళలు, పింఛన్ల లబ్ధిదారులంతా పూర్తిగా టీడీసీ వైపే మొగ్గు చూపారన్నారు. చాలాచోట్ల పురుషుల కన్నా మహిళల ఓట్లు ఎక్కువ పోలయ్యాయన్నారు.
ఇక్కడ తాను ఇంత కష్టపడుతున్నానని.. కానీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని, పార్టీని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నాడని ఆరోపించారు. కాగా, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో చంద్రబాబు విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తండ్రి మృతిచెందడంతో ఆమె హాజరుకాలేదు. ఆమె రాకపోతే మిగిలిన నాయకులు కూడా గైర్హాజరవడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, శుక్రవారం రాత్రి విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ నాయకులతో కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.