ఉండవల్లిలో ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు
సాక్షి, అమరావతి : శాసనసభకు ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా, పట్టుదలగా పని చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ చారిత్రక అవసరమని, గత 37 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని, ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత అనేక అవమానాలు భరించామని తెలిపారు. రాజీవ్ గాంధీ హత్యోదంతం దరిమిలా విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎన్టీఆర్‌కు అవమానాలు ఎదురయ్యాయని అవన్నీ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్థ్యం బయట పడుతుందన్నారు. కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మ విశ్వాసం, మనో ధైర్యం పెంచాలన్నారు. గత 15 రోజులుగా అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని, వీటిని ఖండించాలని తెలిపారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున ఏం చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి, పేదల సంక్షేమమేనని, అధికారం కాదన్నారు.
చివరి దశకు చేరిన పనులు ఆపేస్తున్నారు..
రుణమాఫీ నాలుగు, ఐదు విడతల చెల్లింపు 10 శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లు చెల్లేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. నాలుగు, ఐదు కిస్తీల కింద ఇవ్వాల్సిన రూ.10 వేల కోట్ల రైతుల సొమ్మును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదన్నారు. ప్రతిరోజూ తనను కలుస్తున్న అనేక మంది రైతులు, రైతు కుటుంబాల మహిళలు దీనిపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి కొరత లేకుండా చేయాలని, రబీ నుంచి ఇవ్వడం వల్ల రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడులకు సమస్య వస్తుందన్నారు. అభద్రత పెంచితే, శాంతిభద్రతలను దెబ్బతీస్తే పెట్టుబడులు ఏం వస్తాయని వ్యాఖ్యానించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామని, మిగిలినవి చివరి దశకు చేరాయని, వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నారని, పనులు నిలిపేస్తున్నారని, దీనివల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు అడ్డంకిగా మారుతుందన్నారు.
వైఎస్సార్‌సీపీ వైఖరితో రాష్ట్రానికి నష్టం
అవగాహన లేక పోవడం, చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద జల్లడమే త్రిసూత్రంగా వైఎస్సార్‌సీపీ పెట్టుకుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని అమరావతి అభివృద్ధి అంశం.. ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఇదే విధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో సభ ద్వారా ప్రజలకు తెలపాలని సూచించారు. తొలుత టీడీపీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, 15వ తేదీ వర్క్ షాప్‌లో దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానాలు చేశారు. అసెంబ్లీ ప్రారంభంరోజు అందరూ పసుపు చొక్కాలతో రావాలని, ఉదయం 9.30 కల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని అక్కడి నుంచి బయల్దేరి వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, రామానాయుడు, కరణం బలరామ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీరాంజనేయులు, బాలకృష్ణ, వల్లభనేని వంశీ తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
శాసనసభలో టీడీపీ నేతగా చంద్రబాబు
శాసనసభలో తెలుగుదేశం పార్టీ నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహరించనున్నారు. శాసనసభ, శాసనమండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, విప్‌లను నియమించే బాధ్యతను గత శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబుకు అప్పగించగా ఆయన ఈ నియామకాలను ప్రకటించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. శాసనసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా చంద్రబాబునాయుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, విప్‌గా వీరాంజనేయస్వామి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శాసనమండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా యనమల రామకృష్ణుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా డొక్కా మాణిక్య వరప్రసాద్, సంధ్యారాణి, గౌరువాని శ్రీనివాసులు, విప్‌గా బుద్ధా వెంకన్న ఉంటారని తెలిపారు. టీడీపీ శాసనసభాపక్ష కోశాధికారిగా మద్దాల గిరిని నియమించినట్లు తెలిపారు.
శాసనమండలిలో క్రియాశీలంగా ఉండాలి : ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచన
టీడీపీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ప్రజావేదికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ 23 మంది సభ్యులు ఉండగా, మండలిలో అంతకన్నా ఎక్కువ మంది ఉన్నందున మరింత క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి తొలుత ఆరు నెలల సమయం ఇద్దామనుకున్నామని, అయితే వైఎస్సార్‌సీపీ ఆధిపత్య ధోరణితో వెళ్తున్నందున మౌనంగా ఉండలేమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment