
సాక్షి, అమరావతి: పిల్లచేష్టలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు టీఆర్‌ఎస్ నష్టం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై ఎవరైనా డేటాను హైదరాబాద్‌లో పెడతారా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డేటా చోరీ పేరుతో ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అహంకారం నెత్తికెక్కి టీఆర్‌ఎస్ విపరీత చేష్టలు చేస్తోందని, సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. తమ డేటా కొట్టేసి తమపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని, 60 ఏళ్ల కష్టంతో కూడబెట్టిన ఆస్తులను లాగేసుకున్నారని ఆరోపించారు. ఏమీ లేని డేటా అంశాన్ని పెద్ద ఇష్యూ చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో మంగళవారం రాత్రి జరిగిన చిత్తూరు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విలువలు లేవని, ఢిల్లీ వెళ్లి 59 లక్షల దొంగ ఓట్లున్నాయని తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. దేశంలో ఆధార్ బ్రీచ్ ఎవరికి సాధ్యం కాదని, ఆధార్ అనేది యునిక్ ఐడెంటిటీ అని, ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాగా విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో మంగళవారం టీడీపీలో చేరారు. భీమిలి, మాడుగుల మాజీ ఎమ్మెల్యేలు కర్రి సీతారాం, పూడి మంగపతిరావులకు ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో చంద్రబాబు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment