ఒంగోలులో మాట్లాడుతున్న చంద్రబాబు
‘ఏం తమ్ముళ్లూ బ్రాండ్లన్నీ దొరుకుతున్నాయా? తాగుబోతుల పొట్ట కొడుతోందీ ప్రభుత్వం. రోజంతా పని చేసిన బాధ మర్చిపోవడానికి మీరు ఓ పెగ్గేసుకుంటే రేట్లు పెంచి మీ పొట్ట కొడుతున్నారు. ప్రశ్నిస్తే మామీదే కేసులు పెడతారా? గుర్తుంచుకోండి.. వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది’
– చంద్రబాబు
అద్దంకి/మార్టూరు, ఒంగోలు: ‘మాట్లాడే హక్కు లేదు. విమర్శించే హక్కు లేదు. నిరసన తెలిపే హక్కు లేదు. నోరు తెరిస్తే పోలీసులొస్తారు. తమాషానా ఇది? మీరు నా దగ్గర 14 ఏళ్లు పనిచేశారు. మళ్లీ పనిచేయాలి. అన్నీ నాకు గుర్తుంటాయ్, అరెస్ట్‌లు చేస్తే మీ కథ చూస్తా’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు బుధవారం తొలిరోజు ప్రకాశం జిల్లా మేదరమెట్ల, మార్టూరు, ఒంగోలులో మాట్లాడారు. ‘ఒక రాష్ట్రం మూడు రాజధానులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? రాజధాని పెట్టమని విశాఖపట్నం వాసులు అడిగారా? కోర్టు పెట్టమని కర్నూలు వాళ్లు అడిగారా?’ అని ప్రశ్నించారు. ఐటీ దాడులపై చంద్రబాబు స్పందిస్తూ జగన్ కొండను తవ్వి ఎలుకను పట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎలుక తోక చివర బొచ్చును కూడా ఆయన పట్టుకోలేకపోయారంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. సీఎంని పదేపదే పిచ్చి తుగ్లక్, నీచుడు, బుద్ధిలేని పెద్ద మనిషి అంటూ దూషణలకు దిగారు.
నేను రాగానే మిగతా రుణమాఫీ
తాను అధికారంలోకి రాగానే 4, 5 విడతల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. గ్రానైట్ పరిశ్రమ ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుంటే రూ.1,900 కోట్లు జరిమానా విధించడం ఏమిటన్నారు.
Comments
Please login to add a commentAdd a comment