
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. ఈ పదవులపై సీనియర్లతో పాటు పలువురు నాయకులు ఆశలు పెట్టుకోవడంతో పోటీ ఎక్కువగానే ఉందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ చీఫ్ విప్ రేసులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందంజలో ఉన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
శాసనమండలి ఛైర్మన్ పదవికి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మండలి చైర్మన్ పదవికి ఎన్‌ఎండీ ఫరూఖ్ పేరును చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో చీఫ్, మూడు విప్ పదవుల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మండలి చీఫ్ విప్ పదవిని దక్కించుకునేందుకు టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్రప్రసాద్, రామసుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విప్ పదవి రేసులో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీశ్, అంగర రామ్మోహన్‌రావు, సంధ్యారాణి ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పదవులు ఎవరి దక్కుతాయన్న దానిపై అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది.