
సాక్షి, అమరావతి: ఏపీకి అన్యాయం జరుగుతూంటే మీకు రోషం లేదా.. సిగ్గులేదా? అంటూ సీఎం చంద్రబాబు బీజేపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విభజన చట్టం అమలు’ అంశంపై శాసనసభలో శుక్రవారం బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్న సమయంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. వచ్చీ రావడంతోనే విరుచుపడ్డారు. ‘ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో ఎన్ని కేంద్ర ఇన్‌స్టిట్యూషన్లు ఉన్నాయో తెలుసా? ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? రక్తం పొంగుతోంది, మీరు రాష్ట్రంలో ఊడిగం చేస్తారా? ఏం మమ్మల్ని జైల్లో పెడతారా’ అంటూ ఊగిపోయారు. సీఎం వ్యాఖ్యల పట్ల బీజేపీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు, మాణిక్యాలరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే సీఎం తన వ్యాఖ్యలు కొనసాగించారు. ‘మీరు ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి అర్హత లేదు, ఏం తమాషా చేస్తారా? మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? ’ అంటూ వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు.
ఎన్నికలకు ముందు మాణిక్యాలరావు ఎవరో తెలియదని, తమ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించినా తానే అందరికీ నచ్చజెప్పి గెలిపించామన్నారు. ‘హైదరాబాద్‌ను నేనే కట్టాను, ఐఎస్‌బీని కష్టపడి తెచ్చాను. రాష్ట్రంలో 14 సీట్లు ఇస్తే 4 గెలిచారు. ఈ రాష్ట్రంలో మీకు బలముందా? కియా మోటార్స్‌ను నేను తెస్తే బీజేపీ తెచ్చిందని అంటారా? ఆనాడు గోద్రా అల్లర్ల సమయంలో మోదీని తీవ్రంగా వ్యతిరేకించాను. వాజ్‌పేయిని చూసి బయటకు రాలేకపోయాను’ అంటూ ఊగిపోయారు. పోలవరం ప్రాజెక్టు 65 శాతం పనులు పూర్తయ్యాయని, దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు అయినా ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది?
‘కడపలో స్టీల్ ప్లాంటు గురించి అడిగితే బీజేపీ వారు రాయలసీమ డిక్లరేషన్ ఇస్తారు. విపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కడప ఉక్కు కర్మాగారం గురించి అడగరు. అప్పటి యూపీఏ సర్కారు రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పెట్టింది. మరి బీజేపీ సర్కారు ఎన్ని పెట్టింది? చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు మొండిచేయి చూపారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు ఫైలును పైకి, కిందకు తిప్పుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపును కూడా అడ్డుకున్నారు. చివరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఏపీ గురించి ఒక్క పదం కూడా లేదు. బీజేపీ మోసానికి నిరనసగా ఈనెల 11న ఢిల్లీలో నినదించడానికి నిరాహార దీక్ష పెడుతున్నాం. దీక్ష తర్వాత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తాం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఎక్కడుందో తెలియదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాది యూటర్న్ కాదు రైట్ టర్న్. కోడికత్తి (జగన్‌పై హత్యాయత్నం) కేసుతో మీకు (కేంద్ర ప్రభుత్వానికి) ఏమి సంబంధం? మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్‌ఐఏ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడేమో ఆయన కోడికత్తికి ఈకలు పెరికారు. ‘సిట్’ ఏమి చెప్పిందో ఎన్‌ఐఏ అదే చెప్పింది. బీజేపీ సర్కారు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ముంచుతోంది’ అని అన్నారు.
వెంకయ్యకు పదోన్నతో.. పనిష్మెంటో తెలియట్లేదు
రాష్ట్రం విషయంలో బీజేపీ కంటే బ్రిటీష్ వారే మెరుగ్గా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. ‘గుజరాత్‌కు బుల్లెట్ రైలుకు రూ.1.15 లక్షల కోట్లు ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు రూ.2500 కోట్లు ఇచ్చారు. రాజధాని అమరావతికి మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏం మనం పన్నులు కట్టడంలేదా? ఏపీ భారత్‌లో లేదా? మనకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. దక్షిణ భారతదేశానికి మీరు (బీజేపీ వారు) ఏం చేశారు? అన్నీ గుజరాత్‌కు చేస్తున్నారు. వెంకయ్యనాయుడిని మంత్రి పదవి నుంచి తప్పించి కోపంతో ఉప రాష్ట్రపతిని చేశారు. ఇది పనిష్మెంటో? పదోన్నతో దేవుడికే తెలియాలి. ఏమి చేశారని మోదీ విశాఖపట్నం వస్తారు? రైల్వే జోన్ ఇచ్చి విశాఖపట్నం రండి’ అని చంద్రబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment