మీడియాను నియంత్రిస్తున్నారు | Chandrababu Fires On Narendra Modi | Sakshi
Sakshi News home page

మీడియాను నియంత్రిస్తున్నారు

Published Thu, Feb 14 2019 4:34 AM | Last Updated on Thu, Feb 14 2019 4:34 AM

Chandrababu Fires On  Narendra Modi - Sakshi

ఆప్‌ ధర్నాలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. మోదీ ప్రభుత్వం మీడియాను నియంత్రిస్తోందని, పీఎంవో ఆదేశానుసారం నడుచుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఇందులో మీడియా తప్పు లేదని, ఎన్డీయే ప్రభుత్వమే మీడియాపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ తమతో కలసిరావాలని చంద్రబాబు కోరారు. ఒక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ను కనీసం విమానాశ్రయంలోకి కూడా అనుమతించలేదని ఆయన మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్‌ వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేపట్టిన తానాషాహీ హటావో– దేశ్‌ బచావో ధర్నాలో చంద్రబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని, ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో దాడులు చేయిస్తోందన్నారు. దేశంలో ఇంగ్లిష్‌ మాట్లాడే చదువుకున్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే చదువురాని ప్రధాని మోదీయే దేశానికి సమస్యని విమర్శించారు. తాను తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందానని, తనలాగే మోదీ ఎక్కడ చదువుకున్నారో చెప్పాలన్నారు. మోదీ, అమిత్‌ షాల ఆటలు ఇక ఎక్కువ రోజులు సాగవని, ఎన్నికల అనంతరం దేశం కొత్త ప్రధానిని చూస్తుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలాగే కేంద్రం అధికారాలు ఇస్తే మోదీ కంటే అద్భుతంగా కేజ్రీవాల్‌ పనిచేయగలరని చెప్పారు. యూపీ ఎన్నికల కోసం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు వల్ల మోదీ, షాలే లాభపడ్డారని, దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు..

వేదికపై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌
ఆప్‌ ధర్నా కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఒక ఐఏఎస్‌ అధికారి సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వేదికపై కూర్చోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈయన గతంలో కూడా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మంత్రుల మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. వారు ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నా పక్కనే కూర్చున్నారు. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా.. అప్పట్లో ఆయన సమాధానం దాటవేశారు. ఇక భవన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ఏకంగా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ, లేదా అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భవన్‌లోని ఉన్నతాధికారులు కొంత మంది అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో అంటకాగుతుండడంపై మిగతా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ఖర్చుతో ఆప్‌.. ప్రజల సొమ్ముతో బాబు
సరిగ్గా రెండు రోజుల క్రితం ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు చాలా భిన్నంగా బుధవారం ఆప్‌ నిర్వహించిన కార్యక్రమం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ఈ సభను పార్టీ తరఫున నిర్వహించారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన దీక్షకు మాత్రం కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement