వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా! | Chandrababu Invites Other Party MLA, MPs Into TDP With Out Values | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

Published Wed, Jun 6 2018 1:17 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

Chandrababu Invites Other Party MLA, MPs Into TDP With Out Values - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ తమ రాజీనామాలు ఆమోదించడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాలని ఆమె సూచించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామాల ఆమోదానికి ఆమె ఒకే చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరినట్లు మేకపాటి వివరించారు. రాజీనామాల ఆమోదానికి సంబంధించి సాయంత్రం అధికారిక వెలువడనుందని తెలిపారు.

రాజీనామా చేయించి మరీ.. : వరప్రసాద్‌
ఏపీ సీఎం చంద్రబాబుకు డ్రామాలాడటం తప్పా ఏమీ తెలియదంటూ ఎంపీ వరప్రసాద్‌ ఎద్దేవా చేశారు. ఏనాడు కూడా హోదా కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదన్నారు. ఎన్నికలంటే భయం లేదని చెప్పుకునే చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. నంద్యాల ఉప ఎన్నికలో అవినీతి డబ్బుతో గెలిచారని ఆరోపించారు. ఇతరుల పార్టీ నుంచి నేతలు వస్తే.. రాజీనామాలు చేయించి మరీ పార్టీలో చేర్పించుకున్న చరిత్ర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సొంతమన్నారు.

ఉప ఎన్నికలకు వెళ్తాం : వైవీ సుబ్బారెడ్డి
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాజీనామాలు చేశామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ డ్రామాలు చేస్తోందని, ఏపీ ప్రజలకు ఈ విషయం పూర్తిగా అర్థమైందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. కమిటీ ఛైర్మన్‌తో మాట్లాడానని స్పీకర్‌ తమకు చెప్పినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

దేశంలోనే నెంబర్‌ వన్‌ అవినీతి పాలన చంద్రబాబుదేనని, అబద్ధాల పునాదుల మీద చంద్రబాబు అధికారం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. లోక్‌సభలో అసభ్యంగా ప్రవర్తించింది టీడీపీ ఎంపీలేనన్న వరప్రసాద్‌.. హోదా కోసం వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు.

తొలుత నోటీసులిచ్చాం : మిథున్‌రెడ్డి
అవిశ్వాస తీర్మానంపై నోటీసులు తొలుత ఇచ్చింది, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది తమ పార్టీనేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. హోదా కోసం ప్రజలతో కలిసి పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామన్నారు. సంజీవని లాంటి హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. 

విలువు అమ్ముకుని బాబు రాజకీయాలు : వైఎస్‌ అవినాష్‌రెడ్డి
రోజుకో ప్రకటనతో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. ఉప ఎన్నికల వస్తే పోటీ చేస్తామంటారని, కానీ ఫిరాయింపు ఎంపీలపై చర్యలు ఎందుకు తీసుకోరని ఈ సందర్భంగా చంద్రబాబును అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి ఉప ఎన్నికలు కొత్త కాదన్న ఆయన.. తాము ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేస్తామని తెలిపారు. చంద్రబాబులాగా విలువలను అమ్ముకుని రాజకీయాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement