సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి పదవిలో 14 ఏళ్లపాటు కొనసాగిన చంద్రబాబు.. ఆ సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004 వరకు తొమ్మిదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 2014లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి మరో ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగారు. మొత్తంగా ఈ 14 ఏళ్లలో కేవలం 2001లో మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించారు. చివరకు ఆయన హయాంలోనే 2018 ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఆ క్రతువు జరిపించలేదు. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డు తగులుతున్నారు.
తొలినుంచీ ఇంతే..
- తనకు స్థానిక సంస్థలంటే గిట్టదనే విషయాన్ని చంద్రబాబు తొలినుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు.
- 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామ పంచాయతీల అధికారాలను టీడీపీ కార్యకర్తలకు దఖలు చేశారు.
- 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సర్కారు వాయిదా వేస్తూ వచ్చింది.
- 2018 ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించి ఉంటే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి నిధులు వచ్చేవి.
- అయితే, 2018–19 ఆర్థిక సంవత్సరంలో దక్కాల్సిన నిధులు నష్టపోవడానికి సిద్ధపడ్డారే తప్ప స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఇష్టపడలేదు.
- ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మార్చి 31లోగా ఎన్నికల నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.5,100 కోట్లను నష్టపోవాల్సి ఉంటుంది.
- ఈ దృష్ట్యా ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయించి స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు ఎన్నికల్ని వాయిదా వేయించి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు.
‘స్థానిక’ అధికారాలు, విధులూ చంద్రబాబు గుప్పిట్లోనే..
- 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు 28 అధికారాలను, విధులను బదిలీ చేయాల్సి ఉండగా ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు ప్రభుత్వం వాటిని బదిలీ చేయకుండా తన గుప్పిట్లోనే పెట్టకుంది.
- దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించి.. రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలు, విధులను వాటికి బదలాయించారు.
- రాష్ట్ర విభజన అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర వేశారు.
- స్థానిక సంస్థల నిధులను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించి వాటిని నిర్వీర్యం చేసింది.
ఎన్నికలు వాయిదాతో టీడీపీలో హర్షాతిరేకాలు
తమ వల్లే ఎన్నికలు వాయిదాపడ్డాయని చెబుతున్న నేతలు
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో తెలుగుదేశం పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన వెంటనే టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి తమ వల్లే ఎన్నికలు వాయిదాపడ్డాయని, ఇది తమ విజయమేనని చెప్పడం విశేషం. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇదే విషయాన్ని చెప్పారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్‌ను కోరామని ఆ మేరకు వాయిదా వేశారని చాలామంది నేతలు చెప్పారు. కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా తాను మీడియా ద్వారా, వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కోరిన వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కి ధన్యవాదాలు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో తెలపడం గమనార్హం. ఎన్నికలు వాయిదా పడతాయని, ఏదో ఒక మార్గంలో ఎన్నికల్ని అడ్డుకుంటామని రెండురోజుల నుంచే ప్రైవేటు సంభాషణల్లో పలువురు నేతలు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆదివారం ఉదయం ఎన్నికల కమిషనర్ ప్రకటన తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతూ.. తాము చెప్పిందే నిజమైందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment