వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: తాను అధికారంలో ఉండగా కరువు, పంట నష్టం కారణంగా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.2,300 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు 20 రోజులు కూడా గడవకుండా ముందే పరిహారాన్ని అందచేయాలంటూ విమర్శలకు దిగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు చిల్లిగవ్వ విదల్చని చంద్రబాబు ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
పంట నష్టపోయిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం ఎన్యూమరేషన్ జరుగుతుందని, విపత్తు సాయం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వరదలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు విమర్శలకు దిగడం పట్ల కూడా విస్తుపోతున్నారు. ‘మనుషులు సృష్టిస్తే వరదలొస్తాయా? విజ్ఞత కలిగిన వారెవరైనా ఇలా మాట్లాడతారా?’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే హుద్ హుద్ తుపాన్‌తో విశాఖ తీవ్రంగా దెబ్బ తినడం ఆయనకు గుర్తు లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
రుణమాఫీ హామీని నెరవేర్చకుండా లేఖలా?
ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వరదలు వచ్చి కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ప్రకాశం బ్యారేజీకి ఒకే రోజు 7.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తే కరకట్టల వెంట ఉన్న లంక గ్రామాలు దెబ్బ తినకుండా ఉంటాయా?’ అని పరిశీలకులు, ప్రజలు పేర్కొంటున్నారు. కృష్ణా నదికి వరదల సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం కాగా టీడీపీ నేతలు మినహా మరెవరూ విమర్శలు చేయలేదని, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగి తాను తొలి సంతకం చేసిన రైతుల రుణమాఫీ హామీని నెరవేర్చకుండా బకాయిలు చెల్లించాలంటూ ఇప్పుడు ప్రభుత్వానికి లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. వరదలకు ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు లేఖలు రాయడం సిగ్గుచేటని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment