
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలను చూసే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భయంతోనే ’నవరత్నాలు’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేర్ని నాని శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌తో కలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ భయంతోనే చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో అధర్మ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. ఈ దీక్ష కోసం రూ.14 కోట్లు దుర్వినియోగం చేశారని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి మాట దేవుడెరుగని, ఆంధ్రప్రదేశ్‌ను రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇస్తున్నది కల్తీ కుంకుమ, కల్తీ పసుపు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌కు ప్రజల ఆశ్సీసులు..
వైఎస్ జగన్‌కు ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఆయనతో రాష్ట్రాభివృద్ధి సాధ‍్యమని పేర్ని నాని అన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలుపై చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ తలో మాటా మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పతనం ఖాయమని జోస్యం చెప్పారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు, చినరాజప‍్పేనని పేర్ని నాని ఆరోపించారు. కాపులను బీసీలను చేస్తామని సొల్లు కబుర్లు చెప్పిన చినరాజప్ప...కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇప్పించగలరా అని ప్రశ్నలు సంధించారు. చినరాజప్ప తీరు వెర్రి వెంగళప్పలా ఉందని అన్నారు. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌ను కాపు ద్రోహులంటున్న చినరాజప్పే కాపు ద్రోహి అని పేర్ని నాని మండిపడ్డారు. కాపుల మనోభావాలను చంద్రబాబు కాళ్లదగ్గర తాకట్టు పెట‍్టారన్నారు. ఇక పార్టీ మారేవాళ్లు రాజకీయ పరిపక్వత లేనివారన్న కళా వెంకట్రావు మాత్రం ...అవకాశాల కోసం ఎన్ని గోడలు అయనా దూకుతారంటూ ధ్వజమెత్తారు.
బాబూ మీ ఆస్తులు హైదరాబాద్‌లో లేవా?
బీసీల కోసం వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని వైఎస్సార్ సీపీ నేత జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఓట్ల కోసం వాడుకుంటున‍్నారే తప్ప, వాళ్లకు చేసిందేమీ లేదని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే బీసీలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రమంతా ముక‍్తకంఠంతో నిన్ను నమ్మం బాబు అంటున్నారని, టీడీపీలో ఉన్న నేతలు కూడా ఆయనను నమ్మడం లేదన్నారు. టీడీపీ నేతలంతా వైఎస్సార్ సీపీలో చేరుతుంటే చంద్రబాబుకు చలిజ్వరం వచ్చిందన్నారు. చంద్రబాబు మరో పదిరోజుల్లో ఆపద్ధర్మ సీఎం, 50 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి అవుతారని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు పతనం ఖాయమని, ఆయనవి ఉత్తర కుమార ప్రగల్భాలేని తేల్చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీ బెదిరిస్తున్నారంటున్న చంద్రబాబు.. ఆస్తులు, ఆ పార్టీ నేతల ఆస్తులు హైదరాబాద్‌లో లేవా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment