సత్తుపల్లి సభలో మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట: టీఆర్‌ఎస్ అవినీతికి ఆలవాలంగా మారిందని, కేసీఆర్‌తోసహా ఆ పార్టీలో ఎవరివద్దా మచ్చుకైనా నీతి నిజాయితీ కనపడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో బుధవారం జరిగిన ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో మోదీగా వ్యవహరిస్తున్నారని, ఈ రెండు ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నావని తనను అడిగే హక్కు కేసీఆర్‌కు ఎంతమాత్రం లేదని, ఇక్కడి ప్రజలను దోపిడీ నుంచి రక్షించడానికే తాను వచ్చానని ఆయన పేర్కొన్నారు.
మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సీబీఐ, ఈడీ, ఐబీ లను దుర్వినియోగం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి అని అన్నారు. పేదలు దాచుకున్న డబ్బు లు సైతం బ్యాంకుల నుంచి తీసుకోలేని దురదృష్ట పరిస్థితులు నరేంద్రమోదీ కాలంలోనే ప్రారంభమయ్యాయని విమర్శించారు. అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయని, ధరలు పెరిగి, రూపాయి విలువ పడిపోయిందన్నారు. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌తో 37 ఏళ్లపాటు ఉన్న విభేదాలను పక్కన పెట్టామన్నారు.
కేసీఆర్ అహంకార ధోరణితో ముందుకు పోతున్నారని, అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే విధంగా వ్యవహరించడం ఆయనకే చెల్లు అని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలను తానెప్పుడూ తప్పుపట్టనని, అయితే కేసీఆర్ బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్‌కు ఇవే చివరి ఎన్నికలు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లగడపాటి సర్వేలో 90 సీట్లు వస్తాయంటే ఆనందపడ్డ కేసీఆర్, ఇప్పుడు రావంటే వారిపై దాడికి పూనుకున్నారని, ఇది హుందాతనం కాదన్నారు. సభల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట టీడీ పీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మం త్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment