సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.’ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు.
అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా? అంటూ విజయసాయరెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని, పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తయ్యేదన్నారు. 7లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని, ప్రధానమంత్రి మోదీ అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదని ఆయన ధ్వజమెత్తారు.
నీళ్లు తాగారు..ఓట్లేయలేదు: చంద్రబాబు
కాగా గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ప్రజలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తప్పంతా ప్రజలదే అన్నట్లు ఆక్రోశం వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. తమను ఓడించారనే కారణంతో ప్రజలను నోటికొచ్చినట్లు నిందిస్తున్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన వేమురు నియోజకవర్గ కార్యక్తల సమావేశంలో కూడా అదే ధోరణితో మాట్లాడారు. తాను ఎంతో కష్టపడి పట్టిసీమను కట్టి తాగడానికి నీళ్లిచ్చానని, వాటిని తాగారు కానీ తనకు ఓటేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో ఇప్పటికి అర్థం కావడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment