ఆయన శాసనసభ్యుడు కాదు.. కనీసం నామినేటెడ్ ఎమ్మెల్సీ కూడా కాదు.. ఏ చట్టసభలోనూ సభ్యుడు కానప్పటికీ.. కనీసం రాజ్యాంగ పదవులు చేపట్టిన అనుభవమైనా లేనప్పటికీ.. ఏకంగా మంత్రి హోదాలో ఆయా సభల్లోకి అడుగుపెట్టారు.అమాత్యుడిగా అన్ని రకాల అధికారాలు.. రాజభోగాలు అనుభవించారు తప్పితే.. మంత్రిగా క్రీయాశీలంగా వ్యవహరించారా అంటే.. అదీ లేదు. పైగా యువతలతో షికార్లు, జల్సాలతో వార్తల్లోకెక్కారు. ఆయనే మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్.
సరే.. రాజ్యాంగంలో కల్పించిన అవకాశం మేరకు ఆయన్ను మంత్రిగా కేబినెట్‌లోకి తీసుకున్నా.. ఆరు నెలల్లోపు శాసనసభ లేదా మండలిలో ఏదో ఒకదానికి సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఆ రెండూ జరగకపోవడంతో మూడు రోజుల్లో కిడారివారి అమాత్యగిరీ ఊడిపోనుంది.గతంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ విషయంలోనే ఇలా జరిగింది. నాడు.. 1994లో వెన్నుపోటు ఎపిసోడ్‌లో తనకు అండగా నిలిచినందుకు నజరానాగా చంద్రబాబు హరికృష్ణను రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. కానీ చట్టసభకు మాత్రం పంపకపోవడంతో అర్నెల్లు ముగిసిన వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.తిరిగి ఇప్పుడు అటువంటి ఎపిసోడ్‌నే చంద్రబాబు నడిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించినందుకు బహుమతిగా కిడారి సర్వేశ్వరరావును ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఆ హోదాలో పలు ఆక్రమణలకు పాల్పడిన ఆయన్ను గత ఏడాది నక్సల్స్ హతమార్చారు.
ఇదే అదనుగా వైఎస్సార్‌సీపీకి వీరాభిమానులుగా ఉన్న గిరిజనులను సెంటిమెంట్ అస్త్రంతో తనవైపు తిప్పుకొనేందుకు టీడీపీ అధినేత రాజకీయంగా పావులు కదిపారు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కిడారి తనయుడు శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టేశారు. అయితే గడువులోగా ఆయన్ను చట్టసభకు పంపడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు.ఫలితంగా హరికృష్ణ మాదిరిగానే శ్రావణ్ మంత్రి పదవి ముచ్చట ఆర్నెలల్లోనే ముగిసిపోనుంది.
సాక్షి, విశాఖపట్నం: గిరిజనులు 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అక్కున చేర్చుకున్నారు. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించారు. అలా అరుకు నుంచి కిడారి సర్వేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ప్రలోభాలకు లొంగిపోయి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. ప్రభుత్వ విప్ అయ్యరు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడి మావోల ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి వెళ్తుండగా సర్వేశ్వరరావును గత ఏడాది సెప్టెంబర్ 23న మావోలు మట్టుబెట్టారు.
రాజకీయ లబ్ధి కోసమే..
ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలవడంతో గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయని, ఆ వర్గానికి చెందిన వారిని మంత్రులుగా నియమించలేకపోయిన చంద్రబా బు.. సర్వేశ్వరరావు హత్యను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు. కిడారి తనయుడు శ్రావణ్‌కుమార్‌ను తెరపైకి తెచ్చి మంత్రిగిరీ కట్టబెట్టేశారు. శ్రావణ్ చట్టసభల్లో సభ్యుడు కాదు.. పైగా ఆర్నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి కట్టబెట్టడం సరికాదన్న వాదనలు వినిపించినా ఖాతరు చేయలేదు. రాజ్యాంగంలో ఉన్న అవకాశాన్ని అడ్డం పెట్టుకొని గత నవంబర్ 11న జరిగిన కేబినెట్ విస్తరణలో శ్రావణ్‌కుమార్‌కు చోటు కల్పించి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించేశారు.
మండలికైనా పంపలేదు
చట్టసభల్లో సభ్యులు కాని మంత్రులు ఆర్నెల్లలోపు కచ్చితంగా ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుందని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ విషయం తెలిసినా.. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థలు కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరిగినా కిడారికి మాత్రం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఆ ఫలితాలు రాకముందే.. ఈ నెల 11కే ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో మంత్రి పదవికి శ్రావన్ నీళ్లొదలాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించమని సీఎం చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఇప్పటికే సూచించారు. కిడారికి సైతం గవర్నర్ నుంచి ఆ వర్తమానం అందింది. దీంతో సభ్యుడు కాకుండానే చట్టసభల్లోకి అడుగుపెట్టి.. ఆర్నెల్లపాటు మంత్రి పదవిని అనుభవించి.. రాజీనామా చేసిన అరుదైన రికార్డు శ్రావణ్ కుమార్‌కు దక్కింది. నందమూరి హరికృష్ణ తర్వాత రాష్ట్రంలో ఇలా పదవి పోగొట్టుకున్న రెండోవ్యక్తి శ్రావనే. కాగా అరుకు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగిన శ్రావణ్‌కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫలితాల తర్వాతైనా ఆయన చట్టసభలోకి అడుగు పెడతారా?.. ఓటమి పాలై చట్టసభ్యుడు కాని మాజీ మంత్రిగానే మిగిలిపోతారో? చూడాలి. కాగా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత రాజీనామా చేస్తానని కిడారి మీడియాకు తెలిపారు. ఆర్నెల్ల పాటు మంత్రి హోదా చెలాయించిన కిడారి రబ్బర్ స్టాంప్‌గానే ముద్రపడ్డారు. పైగా మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని యువతులతో షికార్లు, విహార యాత్రలు, జల్సాలు చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment