
సాక్షి, అమరావతి: ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు హడలిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. పైన ‘చండ్ర’బాబు నిప్పులు కక్కుతున్నాడని కాదు. కింద చంద్రబాబు విషం కక్కుతున్నాడని! చంద్రబాబు జగన్ మీద కక్కుతున్నాడా.. జనం మీద కక్కుతున్నాడా జనానికి అర్థం కావడం లేదు.
చంద్రబాబు కక్కీ కక్కీ కడుపు పట్టుకున్నప్పుడు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్, యామిని, బుద్ధా వెంకన్న కక్కిపెడుతున్నారు. లోకేశ్‌బాబు కూడా కక్కడానికి ట్రయ్ చేస్తున్నాడు కానీ పాపం మాటలు అడ్డుపడి కక్కుడు సగం గొంతులోనే ఉండిపోతోంది. పపన్ కక్కినంతసేపు కక్కగలుగుతున్నాడు. ఇక కక్కలేను బాబోయ్ అనుకున్నప్పుడు కారు డిక్కీలో కూలబడుతున్నాడు. ‘ఈ’ పేపర్, ‘ఆ’ పైపర్‌లకైతే.. చంద్రబాబు అండ్ టీమ్ ఎప్పుడు కక్కుతుందా, ఆ కక్కుడంతా ఎప్పుడు ఎత్తి పేపర్‌లో పోద్దామా అనే! కక్కుడు కన్నా పెద్దపని కక్కుడుని ఎత్తి పట్టుకోవడం.
‘ఏపీ అన్నం తింటే జగన్‌కి ఓటేయొద్దు’’ అన్నాడు బాబు.
రాష్ట్రంలో ప్రజలంతా ‘అన్న క్యాంటీన్’లలోనే తింటున్నారనా!
‘‘జగన్‌కి ఓటేస్తే రౌడీయిజమే’’ అన్నాడు కళా వెంకటరావు.
జగన్‌కి ఓటేసి బయటికి వచ్చేటప్పుడు పట్టుకుని రౌడీల చేత కొట్టిస్తామనా!
‘‘రామరాజ్యమా? రాక్షసరాజ్యమా?’’ తేల్చుకోండి అన్నాడు యనమల రామకృష్ణుడు.
తేల్చుకోకపోతే, జగన్‌కి ఓటేసిన ఒక్కొక్కరి పనీ తేల్చేస్తాం అనా!
‘‘2004లో జగన్ నలిగిన చొక్కా వేసుకున్నాడు. 2019లో ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు. జగన్ ఆస్తి ఇన్ని కోట్లకు ఎలా చేరిందో జనానికి చెప్పాలి’’ అన్నాడు వర్ల రామయ్య.
జగన్ ఇస్త్రీ చొక్కాకే ఇంత చేస్తున్నాడు. జనం రేపు కొత్త చొక్కాలు వేసుకుంటే, వర్ల రామయ్యకు సమాధానం చెప్పాలనా!
‘‘బాబుకు ఓటేస్తే పసుపు–కుంకుమ ఇస్తాడు’’ అన్నాడు రాజేంద్రప్రసాద్.
చంద్రబాబుకు ఓటేయకపోతే పసుపు–కుంకుమ తుడిచేస్తాడనా!!
‘‘ఓట్లు ఎలా అడుగుతారు?’’ అన్నాడు బుద్ధా వెంకన్న.
‘ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం అనా!
‘‘జగన్ ప్రతిపక్ష నేత కావడం దౌర్భాగ్యం’’ అన్నారు యామిని.
జగన్‌కి ఓటేసిన ప్రజలంతా దౌర్భాగ్యులనా!
‘‘పడ్డాయ్ పడ్డాయ్.. దగ్గర పడ్డాయ్’’ అన్నారు జనంలో ఒకరు. ‘‘ఎన్నికలేగా’’ అన్నారు ఇంకొకరు.
‘‘అవెలాగూ పడతాయి’’
‘‘మరింకేం దగ్గర పడ్డాయి?’’ ‘‘రోజులు దగ్గర పడ్డాయి’’
‘‘ఎవరికి?’’ ‘‘ఇంకెవరికి! జనాన్ని బెదిరిస్తున్న వారికి. జనానికి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నవారికి. జనాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నవారికి. జనాన్ని అవమానిస్తున్న వారికి. జనాన్ని దౌర్భాగ్యులు అన్నవారికి. జనంపై విషం కక్కుతున్నవారందరికీ.. రోజులు దగ్గరపడ్డాయి’’
– మాధవ్
Comments
Please login to add a commentAdd a comment