
చంద్రబాబు ప్రచారసభలకు జనం రావడం మానేశారు. వేదిక కింద ప్రజలు ‘నాయకులసంఖ్య’లో, వేదిక పైన నాయకులు ‘ప్రజలసంఖ్య’లో కనిపిస్తున్నారు.
‘‘చూశారా తమ్ముళ్లూ.. ఆ జగన్‌ని’’ అన్నాడు చంద్రబాబు.. మైకు నోటి దగ్గర పెట్టీ పెట్టుకోగానే.
‘‘చూడ్డానికి తమ్ముళ్లెవరూ రాలేదు సార్. కొంచెంసేపు వెయిట్ చేద్దాం’’ అన్నారు వేదిక మీది నాయక ప్రజలు.
‘‘లీడర్ కోసం జనం వెయిట్ చెయ్యాలి గానీ, జనం కోసం లీడర్ వెయిట్ చెయ్యడం ఏంటయ్యా? తమాషాగా ఉందా! ఎటుపోతున్నాం మనం? ఐ వాంట్ ప్రజలు రైట్ నౌ’’ అన్నాడు చంద్రబాబు.
‘‘రైట్ నౌ అంటే కొంచెం కష్టమేమో సార్. ఎంత ట్రై చేసినా ప్రజలు ఇళ్లలోంచి కదలడం లేదు. ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అని బాబుగారు తన పేరు చెప్పి మరీ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పినా ఎవరూ వినడం లేదు’’ అన్నాడు వేదిక మీద ఆ చివర్న ఉన్న లీడర్ ఈ చివరికొచ్చి.
చంద్రబాబుకి చిరచిరలాడింది.
‘‘ఎండలు ముదిరిపోయాయా? ప్రజలు ముదిరిపోయారా’’ అన్నాడు.
‘‘ఎండలు ముదిరిపోతే.. మనకొక ఎండ, జగన్‌కొక ఎండ ఉండవు కదా నాయుడు గారూ. ఏదో ఊటీకి వెళ్లినట్లు ఓటర్లంతా మూట గట్టుకుని జగన్ మీటింగులకు వెళ్తున్నారు. అంటే.. ఎండలు ముదర్లేదు. ప్రజలే ముదిరారు. ఇకనైనా మీరు జగన్ సీఎం అయితే రాష్ట్రంలో ఏం జరగదో చెప్పడం మాని, మీరు సీఎం కాకపోతే రాష్ట్రానికి ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. రోజుకు వందసార్లు మీకు తెలియకుండానే జగన్.. జగన్.. అంటున్నారు తెలుసా మీరు’’ అన్నాడు వేదిక మీద ఉన్న ఇంకో నాయకుడు.
‘‘ఏంటయ్యా నువ్వు. జగన్‌కి ప్రశాంత్ కిశోర్‌లా, నువ్వు మాకు అశాంత్ కిశోర్‌లా తయారయ్యావు. నోటికి ఒక్క మంచిమాటా రాదా నీకు!’’ అన్నాడు చంద్రబాబు.
‘‘అదిగో చూశారా.. మళ్లీ జగన్ అన్నారు’’ అన్నాడు నాయకుడు.
‘‘సర్లే. జగన్‌ని జగన్ అనకుండా ఇంకేం అనమంటావో చెప్పు. ఏదో ఒకటి అనకపోతే జగన్‌ని జనమే కాదు మనమూ నమ్మేస్తా’’ అన్నాడు చంద్రబాబు.
‘‘ఊ.. జగన్‌లో ‘జ’ని తీసి గన్ అనొచ్చు. కానీ, ఆ గన్‌ని మన మీద మనమే గురి పెట్టుకున్నట్లు అవుతుంది. పోనీ, జగన్‌లో ‘గ’ ని తీసి, జన్ అందామంటే జగన్ జనం మనిషి అన్న మీనింగ్ వస్తుంది. ఈ రెండూ కాకుండా జగన్‌లోని చివరి అక్షరం తీసి ‘జగ’ అంటే మీనింగ్‌లెస్ అవుతుంది. బుర్ర చెడిపోయిందనుకుంటారు మనకు. పూర్తి పేరు జగన్‌మోహన్‌రెడ్డి కాబట్టి, ‘జగన్’ తీసి మోహన్‌రెడ్డి అంటే అసలే వర్కవుట్ కాదు. పవన్ కల్యాణ్‌ని పవన్ కల్యాణ్ అనకుండా కల్యాణ్ అంటే ఏం తెలుస్తుంది? జగన్‌ని జగన్ అని కాకుండా మోహన్‌రెడ్డి అన్నా అంతే’’ అన్నాడు నాయకుడు.
‘‘మరేం చేద్దామంటావ్. జనమూ రాకుండా, జగన్ పేరూ రాకుండా.. ఎలా మనం ప్రచారం చేసుకోవడం’’ అన్నాడు చంద్రబాబు డీలా పడిపోతూ.
స్టేజ్ పైన ఆయన్ని ఆ స్టేజ్‌లో చూసి తట్టుకోలేకపోయారు స్టేజీపై నాయకులు.
‘‘దిగులు పడకండి నాయుడు గారూ. జనం రాకున్నా వచ్చారనీ, జగన్ పేరు ఎత్తకున్నా ఎత్తారని రాయడానికి ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ ఉన్నాయి కదా. అన్నీ మీరన్నవే రాస్తున్నాయా ఆ రెండు పేపర్లు. జనానికి మీరు చెప్పనివి, జగన్‌ని మీరు అననివి కూడా వాటికవే అల్లి, పేజీకో పెద్ద హెడ్డింగ్ పెట్టి వేస్తున్నాయి కదా. ప్రచారాన్ని వాటికి వదిలిపెట్టి మీరు ప్రశాంతంగా ఉండండి’’ అని చంద్రబాబుని సేదతీర్చాడు వేదికపై ఉన్న ఓ నాయకుడు.
– మాధవ్