రుణమాఫీ బకాయిలు చెల్లించేలా ఒత్తిడి చేద్దాం | Chandrababu says Lets pressurize the farmer waiver payments in TDP Meeting | Sakshi
Sakshi News home page

రుణమాఫీ బకాయిలు చెల్లించేలా ఒత్తిడి చేద్దాం

Published Tue, Jun 11 2019 4:01 AM | Last Updated on Tue, Jun 11 2019 8:04 PM

Chandrababu says Lets pressurize the farmer waiver payments in TDP Meeting - Sakshi

సాక్షి, అమరావతి: తాము అధికారంలో ఉండగా చేసిన రైతు రుణమాఫీ మొత్తంలో బకాయి ఉన్న నాలుగు, ఐదో విడత వాయిదాలు వెంటనే చెల్లించేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ సమావేశంలో నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్‌ 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటున్నారని, ఈ ఖరీఫ్‌లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నిలిపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం పార్టీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై పెరిగిన దాడులను ఖండించాలని చంద్రబాబు నాయకులకు సూచించారు.

ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారనే విషయాన్ని పలువురు నేతలు ప్రస్తావించగా అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అనేది తేలిపోయిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును మొదట కేంద్రానికి ఇస్తామన్నారని, ఇప్పుడు ప్రభుత్వమే చేపడతామంటోందని పలువురు నేతలు తెలిపారు. ఇప్పటికే రైతులు ఒక సీజన్‌ కోల్పోయారని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.నాలుగు వేల కోట్లు తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేస్తామనడం సరికాదని కొందరు నాయకులు తెలిపారు. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టుకు నిలిచిపోయే పరిస్థితి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం సరికాదని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిద్దామని చంద్రబాబు తెలిపారు.

ఎక్కువకాలం మౌనం వద్దు...
ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలనే నినాదం బాగా పనిచేసిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సామాజిక సమీకరణాలు, ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు ఈ ఎన్నికల్లో పనిచేశాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా ఎక్కువ కాలం మౌనంగా ఉండటం కూడా మంచిది కాదని పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పోటీ చేసిన అభ్యర్థులతో ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలపై అందులో చర్చించాలని, మంగళవారం ఉదయం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, ఎమ్మెల్యేలు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, నారా లోకేష్, అశోక్‌ బాబు, టీడీ జనార్దన్, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావు, కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement