మళ్లీ మోసపోమప్పో..! | Sakshi
Sakshi News home page

మళ్లీ మోసపోమపప్పో..!

Published Wed, May 8 2024 2:50 AM

-

చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పేరు చెబితే నవ్వుతున్న జనం బాబు హామీలపై వ్యంగ్యాస్త్రాలు

గతంలో ఆయన మోసాలను గుర్తు చేసుకుంటున్న వైనం

అధికారంలోకి వస్తే ఉన్న పథకాలు ఎత్తేస్తారని చర్చ

ఇప్పటికే ఇంటికొచ్చి అందించే పెన్షన్లను కక్ష కట్టి నిలిపేయించారని వృద్ధుల్లో ఆగ్రహం

బాబు అంటే మండిపడుతున్న డ్వాక్రా మహిళలు

జనంలో వ్యతిరేకత ఉండటంతోనే టీడీపీ నాయకుల దాడులు.. ప్రలోభాలు

👉కొత్త సంక్షేమ పథకాలుఅటుంచితే బాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న పథకాలు ఎక్కడ నిలిపివేస్తారోఅన్న భయం పట్టుకుంది. ప్రజలను నమ్మించి దగా చేయడం బాబుకు అలవాటేగా!
– గార్లదిన్నె మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ నిట్టూర్పు

👉2014 ఎన్నికల్లో 600 పైగా హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను వంచించారు. అలాంటి వ్యక్తి నేడు మళ్లీ సిగ్గులేకుండా హామీలిస్తున్నారు.బాబును నమ్మలేం.
– కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆగ్రహం

👉పేదల బాగు కోసం సీఎం జగన్‌ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక కాబోతోందని విమర్శించిన వ్యక్తి.. అధికారంలోకి వస్తే అవే పథకాలు కొనసాగిస్తూ మరింత ఎక్కువ చేస్తామనడాన్ని ఎలా చూడాలి?
– రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ అధ్యాపకుడి విశ్లేషణ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇష్టారాజ్యంగా హామీలిచ్చేసి, గద్దెనెక్కిన తర్వాత నమ్మి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను నిలువునా ముంచేయడం ఎలా అనే విషయం ఆయన గత చరిత్ర చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. పొరపాటున అధికారంలోకి వస్తే, ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచేసి, అన్నీ అమలు చేశానని బుకాయించడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ తెలియదేమో! అందుకే బాబు నోటి నుంచి ఏది వస్తుందో అది చేయరు అన్న విషయం ప్రజల్లో నాటుకుపోయింది.

నమ్మం బాబూ..!
ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌, సతీమణి భువనేశ్వరి కూడా ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల సభలు నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అంటూ ప్రకటించారు. అయితే, వారి మాటలు ఎవరూ నమ్మడం లేదనేది అక్షర సత్యం. ప్రస్తుతం పెన్షన్‌ రూ.3 వేలు ఇస్తున్నారు. తాను నాలుగు వేలు ఇస్తానన్నా కనీసం దానిపై చర్చ జరగడం లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలతో టీడీపీ అభ్యర్థులు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇల్లిల్లూ తిరుగుతున్నా, ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుండటం, బాబు హామీలను కనీసం ప్రజలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటమి భయం ఎక్కువైనట్లు తెలిసింది.

గుణపాఠం చెప్పినా మారని తీరు..
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి తదితర హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటిల్లో ఒక్క దాన్ని కూడా సరిగ్గా నెరవేర్చిన పాపాన లేదు. దీంతోనే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్‌ సీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి ‘నిన్ను నమ్మం బాబు’ అని స్పష్టం చేశారు. అయినా, గతం మరిచి నేడు మళ్లీ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి.

బాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు!
2014–19 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలను తెచ్చి పల్లెల్లో నిప్పులు పోశారని, ఏ ఒక్కరికీ లబ్ధి కలగకుండా చేశారని గ్రామీణులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వచ్చి జన్మభూమి కమిటీలు ప్రవేశపెడితే తమ బతుకులు ఎంత దుర్భరంగా మారతాయోనని పేద ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా నేరుగా వలంటీర్లే ఇంటికొచ్చి పథకాల గురించి చెప్పి, అర్హులైన వారికి లబ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉన్న ఊరిలోకే పాలన వచ్చింది. కానీ, బాబు వస్తే ఇవన్నీ అమలు చేయరేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నవే రాకుండా చేశారు.. కొత్తగా ఏమిస్తారు?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రమారమి 5 లక్షల మంది వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటి వద్దకే వెళ్లి వలంటీర్లు డబ్బు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యులు ఎన్నికల కమిషన్‌ మాటున పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ విషయంపై ఇప్పటికే వృద్ధులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్లకు ఎంతో సాంత్వన చేకూరుస్తున్న వ్యవస్థనే ఆపేయించిన బాబు.. కొత్తగా రూ.4 వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. 

పెన్షన్‌ పెంచుతానన్న హామీతో కరపత్రాలు ఇస్తుంటే వాటిని వెంటనే చెత్తబుట్టలో వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో బాబుపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను భయాందోళనకు గురి చేసైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో, బాబు ఇచ్చిన ఆదేశాలతో పచ్చ మూకలు దాడులకు దిగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, టీడీపీ కుయుక్తులను గమనిస్తున్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లోనూ దిమ్మతిరిగే సమాధానం చెబుతారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement