సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడరని ఆపధర్మ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పొల్గొన్న సోనియా గాంధీ టీఆర్‌ఎస్ పాలనపై మండిపడ్డ విషయం తెలిసిందే. దీనిపై శనివారం సాక్షితో మాట్లాడిన హరీష్.. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఆమె ప్రసంగించారని అన్నారు. తెలంగాణ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏవిధంగా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో హామీలను అమలుచేయని నేతల్ని తీసుకువచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలోనే దిక్కులేని చంద్రబాబు ఇక్కడ ఏం సాధిస్తారని హరీష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబుకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. మెదక్ టీడీపీ నేతలు ఎల్ రమణ సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోసం అక్రమంగా పొత్తుపెట్టుకున్న మహాకూటమి నేతల మధ్యనే సరైన సఖ్యత లేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పక్షానే నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల సమయం దగ్గర పడుతుండంతో ప్రజాకూటమి, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్దం చెలరేగుతోంది. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న కూటమి నేతలు కేసీఆర్ పాలనపై దుమ్మెత్తిపోసిన విషయం తెలిసింది. వారి వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం సన్నమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment