'చేతి'ని ఆడించే మణికట్టు బాబు | Sakshi special interview with Harish Rao | Sakshi
Sakshi News home page

'చేతి'ని ఆడించే మణికట్టు బాబు

Published Wed, Nov 28 2018 2:31 AM | Last Updated on Wed, Nov 28 2018 1:29 PM

Sakshi special interview with Harish Rao

‘నిజాలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల చావుకు కారణమైంది చంద్రబాబు, సోనియాగాంధీయే. విద్యార్థుల సూసైడ్‌నోట్లలో ఉన్నది కూడా వారిద్దరి పేర్లే. ఆ ఇద్దరూ ఒక్కటయి వస్తున్నారు. చంద్రబాబు ప్రవేశాన్ని తెలంగాణ సమాజం సహించదు. కాంగ్రెస్‌ అక్రమాలపై పుస్తకాలు ప్రచురించి దేశమంతా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు నోరెందుకు మూసుకున్నాడు? తన పాపాలు బద్దలవుతాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది. తెలంగాణలో పెత్తనం చెలాయించడానికి ఈ ఎన్నికలు అడ్డుపెట్టుకుని కూటమిలో చేరాడు. తెలంగాణలో ఏదో రకంగా అధికారం సంపాదించుకోవచ్చన్న యావ ఆయనలో ఉంది. తెలంగాణ సమాజం ఛీ కొట్టినా బాబులో మార్పు లేదు. ఏదోలా ఇక్కడ రాజకీయాలు చేయాలన్న కుట్రతో వస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ గమనిస్తే కాంగ్రెస్‌ చేయిని ఆడించే మణికట్టు చంద్రబాబే’ అని టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని, అలాంటి కూటమిని ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పక్కనే ఉండగా మెదక్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత నరోత్తమ్‌రెడ్డిని రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్చుకోవడమంటేనే వాళ్లలో వాళ్లకు విశ్వాసం లేదనేది తెలుస్తోందన్నారు. ఇక సొంతంగా సీటు తెచ్చుకోలేని కోదండరాం స్టీరింగ్‌ ఎలా తిప్పుతారని, వలసవాద టీడీపీని బహిష్కరించాలని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీతో ఎలా కలిసి పనిచేస్తారని నిలదీశారు. తెలంగాణ స్వయంపాలన, స్వీయ అస్తిత్వం కోసం ఎప్పటినుంచో పోరాడుతున్నానని, ఇకముందు కూడా పోరాడుతానని హరీశ్‌ స్పష్టంచేశారు. ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న సమయంలో ఎన్నికల ప్రచార సరళి, కాంగ్రెస్‌ ఆరోపణలు, కూటమి ఎజెండా, చంద్రబాబు పాత్ర, సాగునీటి మంత్రిగా తన బాధ్యతలు, కుటుంబ పాలన ఆరోపణలపై మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన అంతరంగాన్ని వెల్లడించారు.
– సాక్షి, హైదరాబాద్‌

ఇంటర్వ్యూ విశేషాలివీ...
సాక్షి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ నిధుల్లో ఆరు శాతం కమీషన్‌ తీసుకున్నారని, ఆ నిధులతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపిస్తున్నారు కదా? 
హరీశ్‌: సాగునీటి ప్రాజెక్టుల పనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద శాతం పారదర్శకంగా చేపట్టింది. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, ఈపీసీ టెండర్లతో కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి పనులన్నీ అవినీతిమయమే. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు వ్యవహారం కాంగ్రెస్‌ అవినీతికి పెద్ద ఉదాహరణ. ప్రాజెక్టుకు నాలుగు చోట్ల శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. సర్వేల కోసం అర శాతం మొత్తాన్ని మాత్రమే కేటాయించాలని టెండరు నిబంధనలలో పేర్కొన్నారు. టెండర్ల తర్వాత నిబంధనలను తుంగలో తొక్కి సర్వేల కోసం మూడున్నర శాతం నిధులు కేటాయించారు. రూ.150 కోట్ల పనులు మాత్రమే చేసి.. సర్వేలు, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట రూ.1,450 కోట్లు చెల్లించారు. కాగ్‌ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించి మొట్టికాయలు వేసింది. ప్రాణహిత ప్రాజెక్టు మొబిలైజేషన్‌ అడ్వాన్సు నిధులను కాంగ్రెస్‌ ఎన్నికల కోసం వినియోగించుకుంది. వాళ్లలాగే అందరూ చేస్తారనే అపోహతోనే కాంగ్రెస్‌ ఆరోపణలు. ఇది దొంగే.. దొంగా, దొంగా అని అరిచినట్టుంది. మా ప్రభుత్వం వంద శాతం పారదర్శకతతో ప్రాజెక్టు పనులు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని చంద్రబాబు అప్పుడు ధనయజ్ఞం అని విమర్శించారు. పెద్దపెద్ద పుస్తకాలు ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు. అసెంబ్లీలో గంటలపాటు మాట్లాడారు. అదే చంద్రబాబు ఈరోజు వారితో కలిసి పని చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు ఏమైనట్లు? ఇవేమీ పట్టకుండా మాపై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్మి వేయడమే. 

తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధమైన, నియంతృత్వ పాలనను సాగనంపాలని కోదండరాం అంటున్నారు? 
కోదండరాం పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిన కోదండరాంకు అప్పుడు మేం ఇచ్చిన గౌరవం, ఇప్పుడు కాంగ్రెస్‌ ఆయనతో వ్యవహరిస్తున్న తీరు అందరూ చూస్తున్నారు. కోదండరాం పార్టీకి కాంగ్రెస్‌ మొదట 30 సీట్లు అని చెప్పింది. చివరికి నాలుగు సీట్లు ఇచ్చింది. టీజేఎస్‌కు ఇచ్చిన సీట్లలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను పోటీలో నిలిపింది. స్వయంగా కోదండరాంకు పొద్దున సీటు ఇచ్చి సాయంత్రం గుంజుకుంది. ఎవరిది నియంతృత్వమో ఇప్పుడు కోదండరాంకు అర్థం కావాలి. సీటు లేని కోదండరాం స్టీరింగ్‌ ఎలా తిప్పుతారు?  

మహాకూటమి లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో అందరి కంటే మీరు ఎక్కువగా, తీవ్రంగా స్పందిస్తున్నారు కారణమేమిటి? 
మంత్రిగా కంటే ఉద్యమకారుడిగా, కేసీఆర్‌ అడుగుజాడల్లో నడిచే కార్యకర్తగా తెలంగాణ స్వీయ అస్తిత్వాన్ని కాపాడడం నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల విషయంలో నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నా. జయశంకర్‌సార్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం ప్రకారమే పని చేస్తున్నా. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా తగ్గకుండా చూడడం ఉద్యమకారుడిగా, సాగునీటి మంత్రిగా నా బాధ్యత. ఎన్నికలప్పుడే కాదు నీళ్ల విషయంలో తెలంగాణకు ఎప్పుడు నష్టం జరిగే పరిస్థితి ఉన్నా ఎదిరిస్తా. ఎదిరించా. తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు అడ్డుకుంటున్న తీరుపై నేను సూటిగా 19 ప్రశ్నలు వస్తే ఏ ఒక్కదానికీ సమాధానం చెప్పలేదు. నా వాదనలో నిజం ఉంది కాబట్టే వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఉద్యమకారుడిగా ఇవి నాకు కొత్తకాదు. వీటికి బెదిరిపోను. జారిపోయేవాడిని కాను. ఇంకా బలపడతా,గట్టిపడతా, పట్టుదలతో పనిచేస్తా. 

ప్రస్తుత ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య పోరు అని అంటుండటంపై మీ అభిప్రాయం? 
టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన అనే అర్హత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదు. హుజూర్‌నగర్‌లో ఆయన, కోదాడలో ఆయన భార్యతోపాటు భువనగిరి, హుజూరాబాద్‌లలో దగ్గరి బంధువులకు పార్టీ టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌లో నెహ్రూ నుంచి రాహుల్‌గాంధీ వరకు కుటుంబ పాలన కాకుంటే మరేమిటి? అయినా మేం వాళ్లలాగ నేరుగా వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణ సాధన ఉద్యమంలో పనిచేశాం. మా ప్రత్యర్థులకు డిపాజిట్లు సైతం రాకుండా ఓటర్లు మమ్మల్ని దీవిస్తే ఇక్కడికి వచ్చాం. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఎత్తిచూపడానికి వారికి ఎలాంటి లోపాలు దొరకడంలేదు. కరెంటు, మంచినీరు, సాగునీరు, సంక్షేమం, అభివృద్ధి.. ఏ విషయంలో అయినా మమ్మల్ని విమర్శించే అవకాశం లేదు. అందుకే కుటుంబపాలన అని, ఇతర వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.  

టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం లేదని పార్టీని వీడుతున్నవారు చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్షల నుంచి టీఆర్‌ఎస్‌ పక్కకు జరిగిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు కదా? 
మా పార్టీ నుంచి వెళ్లిన వారికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డికి నాలుగేళ్లు టీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవం ఉంది. కానీ ఎన్నికల తరుణంలోనే లేదనిపించిందా? ఉద్యమకారులను గౌరవించింది టీఆర్‌ఎస్‌ ఒక్కటే. విద్యార్థి నేతలు బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, పిడమర్తి రవిలకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చాం. బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, రాకేశ్‌లకు అవకాశం కల్పించాం. ఉద్యోగ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, ఘంటా చక్రపాణిలకు, ఉద్యమ నేతలు బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, పాపిరెడ్డి, సాంబయ్యలకు టీఆర్‌ఎస్‌ గుర్తింపు ఇచ్చాం. నాలుగేళ్లు ఉస్మానియా యూనివర్సిటీని రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్‌.. ఒక్క విద్యార్థి నేతకు టికెట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నేత క్యామ మల్లేశం చెప్పారు. కాంగ్రెస్‌లో కాంట్రాక్టర్లకు, రియల్‌ ఎస్టేట్, గ్రానైట్‌ వ్యాపారులకు టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌ నుంచి మా పార్టీలోకి వస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. 

కూటమి కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఎలా ఉంది? 
కూటమి ప్రకటించిన కామన్‌ మినిమమ్‌ ప్రొగ్రాంలో కామన్‌ సెన్స్‌ లోపించింది. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు అడ్డుపడరని స్పష్టత ఇవ్వలేదు. యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపైనా వైఖరి చెప్పలేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే ఏ విషయాన్ని దీంట్లో పొందుపరచలేదు. విభజన చట్టంలో కేవలం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. మన రాష్ట్రంలో ఏ ఒక్కదానికి ఇవ్వకుండా నష్టం చేశారు. ఇప్పుడు సోనియాగాంధీ వచ్చి ఏపీకి ప్రత్యేకహోదా అన్నారు గానీ తెలంగాణ హామీలపై స్పష్టత ఇవ్వలేదు. కూటమితో తెలంగాణలో జోక్యంపై తెలంగాణ ప్రజల్లో నెలకొన్న ఆందోళనల గురించి ఎక్కడా స్పష్టత ఇవ్వని ఆ ప్రణాళికను ఎవరూ అంగీకరించరు. 

మీరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న గజ్వేల్‌ కూటమి అభ్యర్థి మీపై విమర్శలు చేస్తున్నారు? 
మెదక్‌ ఉమ్మడి జిల్లా మంత్రిగా ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం పనిచేశా. ఇప్పుడు మా పార్టీ తరపున ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్నా. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రాష్ట్ర, జాతీయస్థాయి అంశాలు ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మంత్రిగా గజ్వేల్‌లో ప్రభుత్వపరంగా నా బాధ్యతలు నిర్వహించా. ఇప్పుడు పార్టీపరంగా అదే చేస్తున్నా. గజ్వేల్‌లో మా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు ఎవరికీ డిపాజిట్‌ దక్కే పరిస్థితి లేదు. డిపాజిట్‌ రాదనే ఆందోళన, ఆవేదనతో కూటమి అభ్యర్థి రకరకాల నాటకాలు ఆడుతున్నారు. సినీ నటులను మించి నటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి. ఓటమి భయంతో ఏవేవో చేస్తున్నారు. 1998 నుంచి నేను ఆదాయ పన్ను చెల్లిస్తున్నాను. నా విశ్వసనీయత ఏమిటో అందరికీ తెలుసు. వారి విమర్శలను ప్రజలు పట్టించుకోరు.  

టీఆర్‌ఎస్‌కు కూటమి గట్టిపోటీ ఇస్తుందని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిపై ఏమంటారు?
కూటమిలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు. ఉత్తమ్‌పై కోదండరాంకు విశ్వాసం లేదు. ఉత్తమ్‌పై టీడీపీ, సీపీఐలకు నమ్మకంలేదు. వరంగల్‌ తూర్పు, దుబ్బాక నియోజకవర్గాల్లో టీజేఎస్, కాంగ్రెస్‌ అభ్య ర్థులు బరిలో ఉన్నారు. వారే ఇలా ఉంటే కూటమిపై ప్రజలలో ఎలా విశ్వాసం కలుగుతుంది. వలసవాద పార్టీ అయిన టీడీపీని బహిష్కరించాలని 2014 ఎన్నికల సమయంలో కోదండరాం పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే పార్టీ ఆయనకు ఎలా ముద్దయింది? వెలుగుల తెలంగాణను చీకటి తెలంగాణ చేయదల్చుకున్నారా? 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఆ పార్టీతోనే కలిసి ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బరిలో దిగడాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? 
చంద్రబాబు స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతాడు. చంద్రబాబు అక్రమాలు, పాపాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యం లేకపోతే, రాష్ట్రంలో అధికారంలోకి రాకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయం. అన్నింటికీ మించి తెలంగాణలో పెత్తనం కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ తనవి,తన వారి ఆస్తిపాస్తులతో పాటు ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌తో జట్టుకట్టాడు. కూటమిలో చంద్రబాబు కలవడం వల్ల మాకే మేలు. చంద్రబాబు కూటమిలో ఉండడాన్ని తెలంగాణలోని ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరూ సహించరు. చంద్రబాబు, సోనియాగాంధీ వల్లే ప్రాణత్యాగం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఆత్మహత్య లేఖల్లో రాశారు. విద్యార్థులు, ఉద్యమకారుల చావుకు వీరిద్దరే కారణం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి వాపస్‌ తీసుకున్నది సోనియాగాంధీ. తెలంగాణ రాష్ట్రాన్ని చివరి వరకు అడ్డుకున్నది చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుభవించిన వేధింపులు ఉద్యోగులు ఇప్పటికీ మర్చిపోవడంలేదు. సీఎంగా ఉండి వీర్వోలను సైతం సస్పెండ్‌ చేసిన చరిత్ర ఆయనది. ఇప్పుడు చంద్రబాబు, సోనియాగాంధీ పార్టీలు కలిసి వస్తున్నాయి. ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిని అంగీకరించరు.  

తెలంగాణ సాధన ఉద్యమ నినాదంలో కీలకమైన నీళ్ల అంశం మీ పరిధిలోనే ఉంది. ఈ విషయంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారా?
నీళ్ల మంత్రిగా నా పని సంతృప్తితో చేశా. మా పనితీరును ప్రజలు స్వయంగా చూశారు. ప్రాజెక్టుల వద్ద నిద్ర చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వేగంగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఒక్కోరోజు 13 గంటలపాటు సమీక్షలు చేశాను. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసినందుకు ప్రపంచబ్యాంకు సైతం ప్రశంసించింది. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో 13 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇచ్చాం. మరో 12 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. మొత్తం 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. దీంతో సింగూరు, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో వలస పోయిన వారు వాపస్‌ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. 

కూటమి అధికారంలోకి వస్తే పాలనలో చంద్రబాబు జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌ చెబుతున్నారు? 
కూటమి అధికారంలోకి వస్తే హోం, సాగునీరు, పరిశ్రమల శాఖలను టీడీపీ తీసుకోవాలని ఆ పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. ఓటుకు కోట్లు కేసు విచారణ జరగకుండా చూసుకునేందుకు, తెలంగాణలోని శాంతిభద్రతలను అమరావతి నుంచి పర్యవేక్షించేందుకు హోంశాఖ... తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, పూర్తయిన ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు సాగునీటి శాఖ... తెలంగాణలోని పరిశ్రమలను తరలించుకుపోయేందుకు పరిశ్రమల శాఖ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాయా? తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే ఇలాంటి ప్రతిపాదనలతో ఏర్పాటైన కూటమిని ఇక్కడి ప్రజలు ఎలా అంగీకరిస్తారు? జానారెడ్డి, ఉత్తమ్‌ సహా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వంలో ఉండగా, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగినప్పుడు చూస్తూ ఊరుకున్నవారే. రేపు కూడా అంతే జరుగుతుంది. కూటమి అంతా చంద్రబాబు చెప్పుచేతల్లోనే ఉంటుంది. కూటమితో తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో ఈ రోజు వాళ్లు ఇచ్చిన పత్రికా ప్రకటనలే చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ గుర్తు హస్తం కింద మణికట్టుకు టీడీపీ జెండా రంగు పసుపు వేశారు. అంటే చెయ్యిని ఆడించే మణికట్టే టీడీపీ అని స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement