సాక్షి, అమరావతి : చట్టాలు, నిబంధనలను చట్టుబండలుగా మార్చేసిన సీఎం చంద్రబాబు అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ప్రభుత్వ భూములను దర్జాగా కేటాయించడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకు కేటాయించిన టీడీపీ సర్కారు ఫక్తు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు మాత్రం రూ.10 లక్షలకే అప్పగించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
తమ నేత భూ దందాలను చూసి మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అదే దారిలో నడిచారు. ఫుడ్ పార్కులు, పరిశ్రమల ముసుగులో విలువైన భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని దళారీగా మార్చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని భూములు అప్పగించేసి ప్రతిఫలంగా వాటాలు పొందారు.
అయిన వారికి అప్పనంగా భూములిచ్చి వాటాలు పొందడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి ఉచితంగా ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కారు ఏకంగా జీవోనే జారీ చేసింది. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రూ. 13 కోట్లకే ధారాదత్తం చేయడం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను
అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు.
ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది.
ఇష్టారాజ్యంగా ధరల నిర్ణయం
భూముల కేటాయింపులకు సంబంధించి ధరల నిర్ణయంలో సర్కారు ఓ విధానం, పద్ధతిని పాటించలేదు. అమరావతి పేరుతో రైతుల నుంచి సమీకరించిన భూమిని కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన ధరలో పదో వంతు కంటే తక్కువ మొత్తానికే ప్రైవేట్ కంపెనీల పరం చేయడం గమనార్హ్హం. ఎల్‌ఐసీకి ఎకరం రూ.4 కోట్లకు ఇచ్చిన ప్రభుత్వం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఎకరం రూ. 12 లక్షల చొప్పున 12 ఎకరాలు ఇచ్చేసింది.
జేవియర్ స్కూల్‌కు ఎకరం రూ.లక్షకే కట్టబెట్టింది. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వార్షిక ఫీజులు వసూలు చేసే ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత తదితర ప్రైవేట్ విద్యాసంస్థలకు నామమాత్రపు ధరకే భూములు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌కు అమరావతిలో రూ.160 కోట్ల విలువైన 40 ఎకరాలు రూ.20 కోట్లకే ఇచ్చేశారు. అది కూడా ఎన్నికలు రెండు నెలలు ఉండగా ఇచ్చేయడం గమనార్హం. ఇలా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఇప్పటికే 46 ప్రైవేట్ సంస్థలకు 1,260 ఎకరాలకుపైగా సర్కారు కట్టబెట్టింది.
నందమూరి సంస్థకు అప్పనంగా అప్పగింత
ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందమూరి బసవ తారకం ఆస్పత్రికి రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.10 కోట్లు పలికే భూమిని ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. బాలకృష్ణ కుటుంబానికి చెందిన సంస్థకు రూ.150 కోట్ల విలువైన భూమిని రూ.3.75 కోట్లకే అప్పనంగా ఇచ్చేశారు.
పేదల భూములకూ టెండర్
పరిశ్రమల కోసం 10 లక్షల ఎకరాలను సేకరించాలని ఏపీఐఐసీకి నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేదలకు పంచిన అసైన్డ్, పట్టా భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాలను విండ్‌పవర్ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేశారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ‘ముడా’ను కూడా భూ దళారీగా మార్చేశారు.
ముడా నిధులతో మౌలిక వసతులు కల్పించి పారిశ్రామిక సంస్థల ముసుగులో 33 వేల ఎకరాలను కొట్టేయాలని సర్కారు పెద్దలు వ్యూహ రచన చేశారు. అనంతపురం – అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే పేరుతో 26,890 ఎకరాలను కొత్త భూసేకరణ చట్టం/సమీకరణ ద్వారా లాక్కోవాలని ప్రణాళిక రచించారు.
గల్లాకు సంతర్పణ
గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్‌కు తిరుపతిలోని కరకంబాడిలో రూ.108.45 కోట్ల విలువైన 21.69 ఎకరాల భూమిని రూ.4.88 కోట్లకే రాసిచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూమి కేటాయించాలంటూ పెట్టుకున్న దరఖాస్తు గల్లా అరుణకుమారి (జయదేవ్ తల్లి) మంత్రిగా ఉండగానే రెండుసార్లు తిరస్కరణకు గురైంది.
ఆమె కుటుంబానికి చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌కు సమీపంలోనే భారీగా భూములున్నందున ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె మంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. అయితే చంద్రబాబు సర్కారు రాగానే ఆగమేఘాలపై ఈ ఫైలును తెప్పించుకుని మంగళ్ ఇండస్ట్రీస్‌కు కారు చౌకగా భూమిని కట్టబెట్టడం గమనార్హం.
కేటాయించిన భూమికీ ధర తగ్గించారు
వైఎస్సార్ జిల్లాలో ట్రైమాగ్ అల్లాయిస్‌కు భూకేటాయింపు వ్యవహారంలో సర్కారు అనుసరించిన వైఖరిపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎకరా రూ.15.01 లక్షల చొప్పున ఈ సంస్థకు వంద ఎకరాలు కేటాయించారు. డబ్బు కట్టలేనని ఈ సంస్థ చేతులెత్తేస్తే భూమిని వెనక్కు తీసుకోవాల్సిందిపోయి తాజాగా ఈ సంస్థకు ఎకరా భూమి ధరను రూ.3.50 లక్షలకు తగ్గించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా చేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు.
ఇది కర్నూలు జిల్లాలో శాంతిరాముడు అనే టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.30 లక్షలు పలుకుతోంది. ఇదే వ్యక్తికి చెందిన శాంతిరాం కెమికల్స్‌కు ఎకరా రూ.1.05 లక్షల నామమాత్రపు ధరతో 150 ఎకరాలు కేటాయించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు శాంతిరాముడు సహకరించినందుకు ఇవి బాబు ఇచ్చిన బహుమానాలని అధికారులు అంటున్నారు.
విక్రయ హక్కులు కల్పిస్తూ జీవో
కారు చౌకగా కట్టబెట్టిన భూములను తాకట్టు పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు విక్రయ (సకల) హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. బ్యాంకు రుణాల మెలిక పెట్టి విక్రయ హక్కులనూ కల్పించింది.
రూ. 300 కోట్ల భూమి రూ. 40 కోట్లకే...
తిరుపతి చెంతన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌లో మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు కోసం మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు 200 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. తిరుపతి–కాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం కోటిన్నర రూపాయలు పలుకుతుండగా ఎకరం కేవలం రూ.20 లక్షలతో ఇచ్చేశారు. రూ. 300 కోట్ల విలువైన భూమిని రూ. 40 కోట్లకే ధారాదత్తం చేశారు. 2014–20 పారిశ్రామిక విధానం రాయితీల పేరుతో మరో రూ.50 కోట్ల మేర కూడా లబ్ధి చేకూర్చారు.
అయిన వారికి ఫుడ్ పార్కులు
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం ముసుగులో చంద్రబాబు తన అస్మదీయులకు సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.126 కోట్లకే కట్టబెట్టారు. తద్వారా అధికార పార్టీ లోని ముఖ్యనేతలు భారీ ఎత్తున ప్రయోజనం పొందారు.
రూ.520 కోట్ల భూమి రూ.4.99 కోట్లకే ధారాదత్తం
ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులను దోచిపెట్టారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భరత్ (మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనువడు) మంత్రి నారా లోకేష్‌కు తోడల్లుడు కావడం గమనార్హం. భరత్ కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498.93 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
రూ.900 కోట్ల పెట్టుబడితో యూరియా కర్మాగారం పెడతామంటూ బహిరంగ మార్కెట్‌లో రూ.520 కోట్ల విలువైన భూమిని రూ.4.99 కోట్లకే కొట్టేశారు. ఈ భూముల విలువ పెంచడం కోసమే జగ్గయ్యపేటను సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చారు. ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని మూడేళ్లు దాటినా ఇప్పటివరకు అక్కడ కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం స్థలం తీసుకున్న మూడేళ్లలోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలి. కానీ అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాకపోయినా భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ ప్రయత్నించకపోవడం గమనార్హం.
ఇది చాలదన్నట్లు విశాఖ జిల్లా యారాడ సమీపంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్, ఆదాయపన్ను కమిషనరేట్, కస్టమ్స్ కమిషనరేట్, సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ తదితరాలకు కేటాయించిన అత్యంత విలువైన 34 ఎకరాల భూమిని ఇదే కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూమిని కేబినెట్ ద్వారా ఏకంగా రద్దు చేశారు.
ఆంధ్రజ్యోతికి ధారాదత్తం
తనకు భజన చేస్తున్నందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రజ్యోతికి విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రూ.37.50 కోట్ల విలువైన భూమిని రూ.1.70 కోట్లకే ధారాదత్తం చేశారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని పరదేశి పాలంలో బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ ఎకరా రూ.15 కోట్లుపైగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లు ఉందని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రతిపాదన పంపించారు.
ఇదే ధరతో కేటాయించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీ ఎల్‌ఎంఏ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం 1.5 ఎకరాల భూమిని కేవలం రూ.50 లక్షల ఐదు వేలకే కేటాయించింది. చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలోని తూకివాకంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.10 కోట్లు పలుకుతున్న భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించారు. ఈ భూమి బెంగళూరు–విజయవాడ హైవేలో ఉంది.
ఇది చెన్నై–తిరుపతి హైవేకు కూడా పక్కనే ఉండటం వల్ల ఈ భూమి విలువ చాలా ఎక్కువ. 1.5 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.15 కోట్లు కాగా, ప్రభుత్వం రూ.1.20 కోట్లకే ధారాదత్తం చేసింది. ‘లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా భజంత్రీలు వాయిస్తున్న ఆ సంస్థకు చంద్రబాబు సొంత ఆస్తి ఇస్తే తప్పు లేదు. ప్రభుత్వ భూములు, అడ్డగోలుగా ఖజానా సొమ్మునుంచి ప్రకటనలు ఇవ్వడం అన్యాయం’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
రూ.లక్ష కంపెనీకి రూ.300 కోట్ల భూమి
రూ.లక్ష మూలధనంతో 2018 అక్టోబర్‌లో ప్రారంభమైన మేజెస్ ఎలక్ట్రానిక్స్ పార్కుకు చిత్తూరు జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూమిని రూ.40 కోట్లకే కేటాయించారు. అత్యంత వేగంగా భూమి కేటాయించడమే కాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా రూ.50 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. ఇది బాబు బినామీ సంస్థ అని పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మొగిలి ఇందుమౌళిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బాబు బినామీ సీఎం రమేష్ దుబాయ్‌లో కలిసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇది సీఎం రమేష్, ముఖ్యమంత్రి బినామీది అనడానికి ఆధారమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సొంత సంస్థ హెరిటేజ్‌కు..
హెరిటేజ్ సంస్థకు గుట్టు చప్పుడుకాకుండా ప్రభుత్వం మూడు జిల్లాల్లో 26.46 ఎకరాల భూములు కేటాయించింది. పశువుల దాణా తయారీ కేంద్రం పేరుతో రాజధానికి సమీపంలో కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాలు, అనంతపురంలో 6.46 ఎకరాలు కట్టబెట్టారు. ఇందుకు సంబంధించి ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఏపీఐఐసీ మాత్రం భూములు ఇచ్చేసింది. హెరిటేజ్‌కు కేటాయించిన 26.46 ఎకరాల భూమి ధర రూ.50 కోట్లకుపైనే ఉంటుందని అనధికారిక అంచనా. హెరిటేజ్ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి అధిపతులుగా కొనసాగుతుండటం గమనార్హం.
– ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment