వంగలపూడి అనిత ,మాల్యాద్రి శ్రీరామ్ , గళ్లా జయదేవ్, కె.ఎస్. జవహార్
సాక్షి, అమరావతి: దిగుమతి అభ్యర్థులతో టీడీపీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. పక్క నియోజకవర్గం, పక్క జిల్లా, ప్రాంతం నుంచి ఆ ప్రాంత ప్రజలకు తెలియని, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చంద్రబాబు అభ్యర్థిగా పెట్టడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. సమీకరణలు, పరిస్థితుల పేరు చెప్పి పలుచోట్ల స్థానిక నాయకులకు షాకిచ్చి కనీసం జిల్లాకు సంబంధం లేని నేతలను అభ్యర్థులుగా పెట్టడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌ను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు. కొవ్వూరులో ఆయనపై ప్రజల్లో, ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇలా చేశారు. కొవ్వూరు ప్రజలు వద్దనుకున్న నేత తమకెందుకని టీడీపీ శ్రేణులు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వంగలపూడి అనితను రెండు జిల్లాలు దాటించి కొవ్వూరుకు తరలించారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీరామ్ మాల్యాద్రికి ఈసారి అదే జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే సీటు కేటాయించారు. వాస్తవానికి మాల్యాద్రిది నెల్లూరు జిల్లా. ఆయన గతంలో గెలిచాక నియోజకవర్గంలో ఆయన పట్టుమని పది సార్లు కూడా పర్యటించలేదు. దీంతో ఈ దిగుమతి సరుకుని ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవాలని అక్కడి నాయకులు ఒత్తిడి తేవడంతో జిల్లాలోని రాజధాని ప్రాంత నియోజకవర్గానికి మార్చారు.
ఏడాదికోసారీ దక్కని గల్లా దర్శనం
గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి గల్లా జయదేవ్‌ను గుంటూరుకు దిగుమతి చేశారు. గెలిచాక ఆయన ఒక సెలబ్రిటీలా సంవత్సరానికోసారి కూడా అక్కడి నేతలకు దర్శనం ఇవ్వలేదు. తమ కష్టాలు చెప్పుకునేందుకు గల్లా అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మళ్లీ రెండోసారి కూడా ఆయనకే గుంటూరు సీటు ఇవ్వడంతో స్థానిక నాయకులకు ఏం చేయాలో తెలియక వెర్రిచూపులు చూస్తున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను మాల్యాద్రి స్థానంలో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎగుమతి చేశారు.తమ ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వకుండా మరో కొత్త నేతను అంటగట్టడంతో బాపట్ల క్యాడర్ నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇక తిరుపతి స్థానంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పనబాకి లక్ష్మిని పంపుతున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ స్థానికేతర ముద్రతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి గ్రహించి తానే పక్కకు తప్పుకున్నారు.
గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోను అదే పరిస్థితి
గతంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదే జిల్లాలోని పత్తిపాడు అభ్యర్థిగా ఎంపిక చేశారు. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్‌ను గుడివాడ స్థానం నుంచి పోటీకి దింపారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరణం బలరామకృష్ణమూర్తిని చీరాలకు పంపారు. ఇంకా పలుచోట్ల దిగుమతి అభ్యర్థుల్ని టీడీపీ బరిలో దింపగా వారు తమకొద్దని టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. గెలిచిన తర్వాత అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ సమస్యలు, పార్టీ వ్యవహారాలపై ఎవరిని కలవాలో తెలియడంలేదని వాపోతున్నాయి. స్థానికేతరులు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఉంటోందని, వారి వల్ల తమ ప్రాంతానికి మేలు జరగదని నమ్ముతున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment