
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మళ్లీ చుక్కెదురైంది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ఝలక్ ఇచ్చింది. తన పౌరసత్వంపై వేసుకున్న రివ్యూ పిటిషన్‌ను హోంశాఖ కొట్టి వేసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హోం శాఖలో రమేష్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్, 2014లో కూడా టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. వేములవాడ నుంచి చెన్నమనేని శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల నామినేషన్ సందర్భంగా చెన్నమనేని సమర్పించిన అఫిడవిట్‌లో భారత పౌరసత్వం లేదని స్పష్టమైంది.
ఈ విషయంపై గతంలో 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన చెన్నమనేని, 1993లోనే తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నెల 13నే హోం శాఖలో చెన్నమనేని పౌరసత్వానికి సంబంధించిన విచారణ జరగగా ఆయన పౌరసత్వం చెల్లదని తాజాగా హోం శాఖ ప్రకటించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి గండం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.
చెన్నమనేనిపై చర్యలు తీసుకోవాలి : ఆది శ్రీనివాస్
చెన్నమనేని రమేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనిపై కేసీఆర్ వెంటనే స్పందించి టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.