సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వం విషయంలో టీఆర్‌ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచనలు చేసింది. దీనిపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన జర్మనీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో ద్వంద్వ పౌరసత్వం అంశం తెరపైకి వచ్చింది.
నేను చెప్పిందే నిజమైంది!
చెన్నమనేని రమేష్ బాబు భారతీయుడు కాదని తాను చెప్పింది నిజమైందని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొంది, మరో భారత పౌరుడికి చెన్నమనేని అన్యాయం చేశారని, కాలయాపన కోసమే రమేష్ బాబు తిరిగారే తప్ప ఆయన వాదనలో నిజం లేదని తేలిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment