సాక్షి, నల్గొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఉద్యమ ద్రోహులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ జన సమితి అద్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై కోదండరాం ముందుకు రావకపోవడంతోనే తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు దళితులకు ముఖ్యమంత్రి పదవి అంటూ ఇచ్చిన హామీ ఎటు పోయిందని చెరుకు ప్రశ్నించారు. కార్పోరేట్‌లకు వేల ఎకరాలు భూములు ఇస్తుంటే దళితులకు మూడెకరాల భూమి ఏమైందని కోదండరాం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణలో ఉద్యమ శక్తుల ఐక్యత పోవద్దని కోదండరాంకు చెప్పినా తన మాటను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి కలిసి పార్టీ ఏర్పాటు అయితే సామాజిక న్యాయం జరిగేదని అన్నారు.
తమ పార్టీని విలీనం చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగినా కోదండరాం నుంచి సమాధానం రాలేదని చెరుకు సుధాకర్ తెలిపారు. కోదండరాం ఒంటెద్దు పోకడలతోనే కొత్త పార్టీలు వచ్చాయని విమర్శించారు. మీరు పెట్టపోయే పార్టీ ఎవరికోసం, పార్టీ పెట్టడానికి వనరులు ఎక్కడివి ? మీ వెనుక ఎవరు ఉన్నారు ? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పార్టీ పెట్టారో సమాధానం చెప్పాలంటూ కోదండరాంను చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment