
సాక్షి, అమరావతి : గత అయిదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. గతంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగితే.. సబ్ కలెక్టర్ చేతికింది ఉద్యోగిని కులం పేరుతో దుషించానని తప్పుడు కేసుతో కడప సెంట్రల్ జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఉదయం లేవగానే జైలర్ వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎగిరి తన్నాడని, కారణం అడిగితే కూడా చెప్పలేదని భావోద్వేగానికి గురయ్యారు. రెండు రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోకుండా నిరసన చేశానని తెలిపారు. చంద్రబాబు పుట్టిన ఊరికి శాసన సభ్యున్ని అయినంతమాత్రాన తనను ఈ విధంగా శిక్షించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈ రోజు చంద్రబాబు నాయుడు తనను మార్షల్స్ తాకారు.. తోశారు.. అని మాట్లాడుతున్నారు. అప్పడు ఇదే శాసనసభలో తాము నల్ల బ్యాడ్జీలు వేసుకొని వస్తే మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆనాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని చిత్తూరు ధర్నా చేసిన నన్ను రాత్రికి రాత్రి పోలీసు బస్సులో ఎక్కించుకొని తమిళనాడుకు తీసుకెళ్లారు. రాత్రంతా బస్సులో కింద పడుకోబెట్టి తమిళనాడు అంతా తిప్పారు. తల నొప్పిగా ఉందని అడిగితే కూడా ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. తెల్లారి సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. అప్పడు మా జిల్లా నాయకులంతా సంఘీభావం తెలిపితే వదిలారు. టీడీపీ ప్రభుత్వంలో బతుకుతానో..చస్తానో అని తెలియకుండా బతికాను. ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం నాపై అంతా అరాచకంగా ప్రవర్తించింది. ఒక శాసన సభ్యున్ని తమిళనాడుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment