
చింతల పార్థసారథి (ఎఫ్‌బీ ఫొటో)
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నుంచి సీనియర్ నాయకులు బయటకు వచ్చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నుంచి నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఘోరంగా పరాజయం పాలవడంతో ఆ పార్టీని విడిచిపెడుతున్న నాయకుల రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జనసేన సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చైర్మన్ చింతల పార్థసారథి బుధవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కేవలం 6.67 శాతం ఓట్లు (82588 ఓట్లు) మాత్రమే తెచ్చుకుని పరాజయం పాలయ్యారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనపార్టీకి చింతల గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపించారు. ఆయన ఏ పార్టీలో చేరతారో వెల్లడి కాలేదు.
కాగా, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నా జనసేన అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం. (చదవండి: ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!)