దళితులు.. మీకెందుకురా రాజకీయాలు | Chintamaneni Prabhakar Controversial Comments Over Dalits | Sakshi
Sakshi News home page

మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు

Published Wed, Feb 20 2019 3:42 AM | Last Updated on Wed, Feb 20 2019 4:56 PM

Chintamaneni Prabhakar Controversial Comments Over Dalits - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, అమరావతి: మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక  టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు.

ఆ సమయంలో ఓ దళితుడు తాను మాట్లాడతానని మైక్‌ అడగడంతో చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్య, అభ్యంతరకర పదజాలంతో దళితులపై విరుచుకుపడ్డాడు. ‘మొన్న జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని కదా.. నేను మాట్లాడానా.. అప్పుడు గొడవ పడితే మీరు రారా..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడతానంటూ మైక్‌ అడుగుతున్నాడంటూ చింతమనేని మండిపడ్డారు. ‘రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకు పదవులు. మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట..’ అంటూ చింతమనేని దళితులను ఇష్టారీతిన దూషించి అవమానించాడు.

సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో చింతమనేని వివక్షపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాలు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తామంటే టీడీపీ నాయకులకు ఇంత చిన్నచూపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంత నీచంగా కనిపిస్తున్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ.. వాళ్ల అధినేతే అలా ఉన్నప్పుడు టీడీపీ నాయకులు అంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులు శుభ్రంగా ఉండరంటూ అవమానించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయని, రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ముందు చింతమనేనని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. తమను హీనంగా చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. 

నోరు అదుపులో పెట్టుకో..
చింతమనేని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. పదవులెందుకంటూ దళితులను అవమానిస్తున్నావ్‌.. ఈ రోజు నువ్వు అనుభవించే పదవి.. దళిత మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పెట్టిన భిక్ష అనే విషయం మర్చిపోవద్దు. ఈ దేశంలో వేల సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీలకుంది. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్న వాస్తవం తెలుసుకో. ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతే నీకు తగిన బుద్ధి చెబుతాం. 
– డాక్టర్‌ మెండెం సంతోష్‌ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆలిండియా అంబేడ్కర్‌ యువజన సంఘం

అంత అంటరానివాళ్లమా.. 
దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాలను అవమానించేలా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. దళితులు అంత అంటరాని వాళ్లా? మీకెందుకు పదవులు.. మేం పదవులెక్కి పెత్తనం చేస్తామంటూ చింతమనేని అహంకారంగా మాట్లాడటం దుర్మార్గం. గతంలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులను సైతం దుర్బాషలాడాడు. దళిత కార్మికుడు జాన్‌ను అకారణంగా కొట్టాడు. ఆయన ఎమ్మెల్యేనా లేదా రౌడీనా అనేది అర్థం కావడం లేదు. తనపై మూడు కేసులున్నాయని బహిరంగంగా ప్రకటిస్తున్నా చింతమనేని ప్రభాకర్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలి.  
– ఆండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

దళితులను నీచంగా చూస్తారా..
దళితుల మనోభావాల్ని దెబ్బతీసిన చింతమనేని ఎమ్మెల్యే పదవిని స్పీకర్‌ రద్దు చేయాలి. లేదంటే గవర్నర్‌ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేగా ఉండి ఒక బహిరంగ సభలో దళితులను కించపర్చడం దారుణం. దళితులను ఇంత నీచంగా చూస్తారా? రాష్ట్రంలో ఒక పథకం ప్రకారమే దళితులపై దాడులు జరుగుతున్నాయి. దళితులను రాజకీయంగా అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రపతిగా ఒక దళితుడు ఉన్న దేశంలో ఓ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. చింతమనేని ఎమ్మెల్యేగా ఉంటే అధికారులెవరూ కేసులు పెట్టరు.. విచారణ చేయరు. అందుకే వెంటనే ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నాడు. రేపట్నుంచి జిల్లా వ్యాప్తంగా చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తాం.  
– కొయ్యె మోషెన్‌రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

బాబు దళితులను కించపర్చడం వల్లే ఇదంతా..
ముఖ్యమంత్రి చంద్రబాబే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అనటం వల్లే టీడీపీ నేతలు కూడా దళితులను కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డేమో దళితులు శుభ్రంగా ఉండరని అంటాడు. చింతమనేని ఏమో దళితులకు రాజకీయాలెందుకంటూ అవమానిస్తాడు. దళితులు టీడీపీ నేతల దగ్గర జెండాలు మోస్తూ బానిసలుగా బతకాలా? రాజ్యాధికా>రం అక్కర్లేదా? వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతాం. 
– నూకపెయ్యి సుధీర్‌బాబు, ఏలూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు

చింతమనేని తీరే అంత..
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ప్రజాప్రతినిధిలా కాకుండా రౌడీలా వ్యవహరిస్తూ.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. బహిరంగసభల్లో కూడా వందలాది ముందే.. పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా ప్రజల్ని హీనంగా తిడుతుంటాడు. తన మాట వినలేదని గతంలో పెదవేగి ఎస్‌ఐపైనే దాడి చేశాడు. అటవీ అధికారి, మార్కెటింగ్‌ శాఖ అధికారులపైనా దాడులకు పాల్పడ్డాడు. తన ఇసుక దందాను అడ్డుకున్నందుకు అప్పట్లో మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని జట్టుపట్టుకుని మరీ ఈడ్చేయడానికీ చింతమనేనే కారకుడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చింతమనేనినే వెనకేసుకువచ్చారు. దీంతో ఆయన ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గుండుగొలను సెంటర్‌లో బందోబస్తు చేస్తున్న ఏఎస్సై, సీపీవోలపై దాడికి పాల్పడ్డాడు.

తమ సమస్యలపై వినతిపత్రమిచ్చేందుకు వచ్చిన అంగన్‌వాడీ ఉద్యోగులను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. దళిత కార్మికుడు జాన్‌ను అకారణంగా కొట్టాడు. ఇళ్ల స్థలాలు, పొలాల గొడవల పేరుతో ప్రతిరోజూ ఎవరోఒకరిని కొడుతూ, తిడుతూ రౌడీలా చెలామణి అవుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు అండ ఉండటంతో పోలీసులు ఏమి చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. దెందులూరు నియోజకవర్గంలో ఓ మాఫియా కింగ్‌లా వ్యవహరిస్తున్నాడు. ఇసుక, మట్టి, చెరువులు, భూములు ఇలా అన్నింటినీ దోచేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. రౌడీషీటర్‌ ప్రజాప్రతినిధి అవడం, ఆయనకు ముఖ్యమంత్రి వత్తాసు పలకడం ప్రజల దౌర్భాగ్యమంటూ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement